Movies

రంగస్థలం సినిమాలో సమంతాకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

రంగ‌స్థ‌లం చిత్రంలోని ప్ర‌తి ఒక్క పాత్ర పేరు అభిమానుల‌కి అలా గుర్తుండిపోయోలా డిజైన్ చేశాడు సుకుమార్‌. చిట్టిబాబు, రంగ‌మ్మ‌త్త‌, రామ‌ల‌క్ష్మీ ,ప్రెసిడెంట్ పాత్ర‌లు సినీ అభిమానులను ఎంత‌గానో అల‌రించాయి. అయితే ఆ పాత్ర‌ల‌కి సంబంధించి ఎవరికి వారు సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోగా, స‌మంత‌కి మాత్రం వేరొక‌రు గ‌ళం అరువు ఇచ్చారు. స‌మంత వాయిస్ అంటేనే వెంట‌నే హ‌స్కీ వాయిస్ గుర్తొస్తుంది. 

సింగ‌ర్ చిన్న‌యి శ్రీ పాద ఎక్కువ‌గా స‌మంత‌కి డ‌బ్బింగ్ చెబుతుంది. కాని రంగ‌స్థ‌లం చిత్రంలో స‌మంత పాత్రకి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంకి చెందిన జ్యోతి వ‌ర్మ‌చే డ‌బ్బింగ్ చెప్పించారు. ‘సూపర్‌’, ‘తులసి’, ‘సైనికుడు’చిత్రాల‌లో ఉన్న‌ బృందంలోని సభ్యులకు డ‌బ్బింగ్ చెబుతూ వ‌చ్చిన జ్యోతి ఆ తరువాత ‘స్టాలిన్‌’, ‘లక్ష్మీకల్యాణం’, ‘అన్నవరం’ వంటి సినిమాల్లో ప‌లు పాత్ర‌ల‌కి గాత్ర దానం చేసింది.
ప‌లు సీరియ‌ల్స్ కి కూడా డ‌బ్బింగ్ చెప్పింది. ఇక న‌చ్చావులే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర‌కి డ‌బ్ చెప్పిన త‌రువాత అవ‌కాశాలు మ‌రింత పెరిగాయి.

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, వేదం వంటి చిత్రాల‌లోను డ‌బ్బింగ్ చెప్పిన జ్యోతి వ‌ర్మ కంచె చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్‌కి డ‌బ్బింగ్ చెప్పింది.ఇక రంగ‌స్థ‌లంలో స‌మంత పాత్ర కోసం ఎంతోమందిని ప్ర‌య‌త్నించార‌ట‌. చివ‌ర‌కు త‌న‌తో ట్రాక్ చెప్పించాక‌, స‌మంత ఓ రోజు ఆ విరుపులూ, విరామాలూ నేనూ వినాలనుకుంటున్నా. నా ఎదురుగా చెప్పించండి అని అడిగింద‌ట‌.

దీంతో జ్యోతి వ‌ర్మ ..స‌మంత ఎదురుగా ఎలాంటి జంకు లేకుండా డైలాగ్స్ చెప్పేసింద‌ట‌. భ‌లే చెప్పావ్ అని సామ్ మెచ్చుకున్న త‌ర్వాత త‌ను ప‌డిన క‌ష్టం మొత్తం మ‌ర‌చిపోయాన‌ని జ్యోతి వ‌ర్మ చెప్పుకొచ్చింది.