2019 లో భారత రత్న ఎవరికి ఇచ్చారు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించారు. అలాగే నానాజీ దేశ్ ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
1935 డిసెంబర్ 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ అంచలంచెలుగా ఎదిగారు. 2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా, 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు.
భూపేన్ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. కవి, సంగీత కూర్పరి, నటుడు, గాయకుడు, జర్నలిస్ట్, రచయిత, చిత్ర దర్శకుడిగా హజారికా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పని చేశారు. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. సెప్టెంబరు 8, 1926లో అస్సాంలోని సాదియాలో జన్మించిన హజారికా 5 నవంబరు 2011లో కన్నుమూశారు.
జనసంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్ 1999-2005 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయనకు 1999లో కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది.