నానాజీ దేశ్‌ముఖ్‌కి భారతరత్న…ఎవరీ నానాజీ?
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికాతో పాటు నానాజీ దేశ్‌ముఖ్‌కు భారత రత్న అవార్డు దక్కింది. నానాజీ మాజీ జన సంఘ్ నేత. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. నానాజీ దేశ్ ముఖ్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు చండీదాస్ అమృతారావ్ దేశ్‌ముఖ్. 1916, అక్టోబర్ 11న మహారాష్ట్రలోని హింగోలిలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబలో జన్మించారు. బాలగంగాధర్ తిలక్‌ను ఆయనకు స్ఫూర్తి. సికార్‌లో హైస్కూలు విద్యను అభ్యసించిన ఆయన ఆ తర్వాత బిర్లా కాలేజీ (బిట్స్ పిలానీ)లో చదివారు. మహారాష్ట్రలో పుట్టినప్పటికీ రాజస్థాన్, యూపీలో ఆయన తన కార్యకలాపాలను చురుకుగా సాగించే వారు.
నానాజీ దేశ్‌ముఖ్ కి లోకమాన్య తిలక్ స్ఫూర్తి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్‌తో కలసిన తర్వాత ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. 1940లో హెగ్డేవార్ చనిపోయిన తర్వాత చాలా మంది యువత ఆర్ఎస్ఎస్‌లో క్రియాశీలకంగా మారారు. వారిలో నానాజీ దేశ్‌ముఖ్ ఒకరు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎం.ఎస్ గోల్వాల్కర్ సూచనతో యూపీకి వెళ్లి అక్కడ ఆర్ఎస్ఎస్‌ను బలోపేతం చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పత్రికలకు కూడా పనిచేశారు.
అనంతరం భారతీయ జన్‌సంఘ్‌కు యూపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఆచార్య వినోభా భావే భూదాన్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1977 ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1980లో 60వ పడిలోకి రావడంతో రాజకీయాలకు స్వస్తి చేశారు. పూర్తిగా సామాజిక కార్యక్రమాలకు అంకింతమయ్యారు. 1999లో ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్డీయే ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. 1999లో పద్మభూషణ్ అందుకున్నారు.2010 ఫిబ్రవరి 27న తన 93వ ఏట ఆయన కన్నుమూశారు. పేద ప్రజల స్థితిగతులు మెరుగుపరచేందుకు చేసిన కృషికి గాను నానాజీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది.