‘చిరు దోసె’ రెసిపీ సీక్రెట్ తెలుసా?
150 సినిమాల రారాజు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం 151వ సినిమా `సైరా- నరసింహారెడ్డి`లో నటిస్తున్నారు. ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజవుతోంది. అయితే మెగాస్టార్ సినీకెరీర్ ఒక ఎత్తు అనుకుంటే.. ఆయన వ్యక్తిగత జీవితంలో బయటకు తెలీని రహస్యాలు ఇంకొక ఎత్తు. మెగాస్టార్ జీవిత చరిత్రపై పుస్తకాలు రాసిన పలువురు రచయితలు కొన్నిటిని బయట పెట్టారు. అయితే `చిరు దోసె` రెసిపీ రహస్యం గురించి మాత్రం ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. చిరు కనిపెట్టిన ఆ దోసె ఇప్పటికీ చట్నీస్ లో చాలామందికి ఫేవరెట్ దోసె. దూరప్రాంత వాసులతో పాటు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ చట్నీస్ కి వచ్చి తిని వెళుతుంటారు. ఆ హోటల్ మెనూలో దానికి అంతటి ప్రాధాన్యత ఉంది
అయితే అసలు చిరు దోసె రెసిపీ రహస్యం కేవలం చట్నీస్ వాళ్లకు మాత్రమే చిరు ఎందుకు లీక్ చేశారు?
అంటే వాళ్లు మెగాస్టార్ ఇంట ఆయన స్వయంగా వడ్డించిన దోసె తిని తప్పనిసరిగా ఆ రెసిపీ తమకు ఇవ్వాలని కోరారట. దాంతో కాదనలేక ఇచ్చేశారు. చట్నీస్ వాళ్లే ఆ దోసెకు `చిరు దోసె` అని నామకరణం చేశారు. అయితే చిరు అంత ఉదారంగా ఆ రహస్యాన్ని వాళ్లకు చెప్పేసినా కానీ.. అసలు ఆ దోసెను కనిపెట్టేందుకు మెగాస్టార్ ఎన్ని పాట్లు పడ్డారో తెలిస్తే షాక్ తింటారు. ఒకసారి చిక్ మంగుళూరు పరిసరాల్లో ఓ చిన్న కాకా హోటల్లో చిరంజీవి దోసె తిన్నారట. అంతకుముందు అలాంటి రుచికరమైన దోసెను చిరు ఎప్పుడూ తినలేదట. దాని రుచికి మైమరిచిపోయి ఆ హోటల్ యజమానిని రెసిపీ అడిగారట. కానీ అతడు దాని రహస్యం చెప్పలేదు. అది తమ సాంప్రదాయ వంటకం అని చెప్పి రెసిపీ గురించి చెప్పేందుకు నిరాకరించారు.
అయితే ఎలా అయినా ఆ దోసెను కనిపెట్టాలని పంతం పట్టిన చిరు ఇంటికి వచ్చాక తన శ్రీమతి సురేఖ గారికి చెప్పారట. ఆ తర్వాత వంటింట్లో ఇద్దరూ బోలెడన్ని ప్రయోగాలు చేశారు. పలుచని దోసెను రకరకాలుగా ట్రై చేశారు. చివరికి నూనె లేకుండా వేసిన ఒక పలుచని దోసె అద్భుతంగా కుదిరింది. దాని టేస్ట్ చిక్ మంగుళూరు దోసె కంటే అదిరిపోయిందట. అటుపై ఆ దోసె రెసిపీని రాసుకుని దానినే ఇంట్లో తినేవారట. ఆ దోసె కోసమే అంగలారుస్తూ పలువురు సినీ స్టార్లు తమ ఇంటికి వచ్చేవారని చిరు తెలిపారు. కొరియోగ్రాఫర్ కం దర్శకుడు ప్రభుదేవా.. సహజనటి జయసుధ తప్పనిసరిగా చిరు ఇంటికి వచ్చి చిరు దోసెను తినాల్సిందేనని అంటారట. అలా ఎందరో ఆ దోసెను రుచి చూశారు. ఈ మొత్తం రహస్యాల్ని చిరు ఎవరికీ లీక్ చేయలేదు కానీ.. కోడలు పిల్ల ఉపాసన నిర్వహిస్తున్న `బీ- పాజిటివ్` మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మొత్తం లీక్ చేశారు. చిరు దోసె వెనక అంత కథ ఉందన్నమాట. ఎంతో ఇంట్రెస్టింగ్ కదూ?