Politics

సినిమాను మించిన ట్విస్ట్ లతో ‘సుష్మా స్వరాజ్’ ప్రేమ వివాహం..!!

అది 1970నాటి కాలం.. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలోని లా కాలేజ్‌..నిండైన కట్టుబొట్టుతో ఉన్న ఓ యువతి హిందీలో అనర్గళంగా మాట్లాడుతోంది. అటువైపు ఓ అబ్బాయి కూడా ఆమెకు ఏమాత్రం తగ్గకుండా ఇంగ్లిష్‌లో అదరగొడుతున్నాడు. వారు మాట్లాడే అంశం మీద పట్టు ఉండటంతో ఇద్దరి మధ్యా వాడి వేడి చర్చ జరుగుతోంది. ఆమె మాట్లాడే విధానానికి ముగ్ధుడైన ఆ వ్యక్తి ప్రసంగించడం ఆపేశారు. తర్వాత ఒకర్నొకరు చూసుకున్నారు. అప్పటి వరకూ ఒకరి మాటలతో మరొకరు విభేదించిన వారు.. ఒక్కసారిగా మాటలు కలుపుకొన్నారు. ఆ మాటలు పరిచయానికి దారి తీశాయి.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కించింది. తూర్పు, పడమరలా ఉన్న వారిద్దరూ వివాహ బంధంతో పాలు, పంచదారలా కలిసిపోయారు. చూడటానికి, చదవడానికి అచ్చం సినిమా స్టోరీలా ఉన్నా..ఇది ఓ యథార్థ ఘటన.

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రేమ గాథ. సుష్మా స్వరాజ్‌, ఆమె భర్త స్వరాజ్‌ కౌశల్‌ అభిరుచులు కూడా భిన్నం. వీరిద్దరి వ్యక్తిగత సిద్ధాంతాలు కూడా వేరు. అలాంటి వ్యక్తులను ప్రేమ బంధం కలిపింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. అయినా సుష్మ ధైర్యం, విశ్వాసం కోల్పోలేదు. తర్వాత కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయి. దేశంలో అత్యయిక స్థితి శిఖరాగ్రానికి చేరిన సమయంలో వీరి ప్రేమ పెళ్లిగా మారింది. 1975 జులై 13న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత సుష్మ తన పేరులో స్వరాజ్‌ అని తన భర్త పేరును చేర్చుకున్నారు. హరియాణకు చెందిన ఓ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే అప్పట్లో ఎంతో మంది ఆశ్చర్యపోయారు.

ఇక అప్పటి నుంచి మొదలైన వారి బంధం 44 ఏళ్ల పాటు ఎలాంటి కలతలు లేకుండా సాగింది. వీరికి ఒక్కగానొక్క కుమార్తె బన్సూరీ స్వరాజ్‌. సుష్మా-కౌశల్‌కు ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమ. అంతకు మించి గౌరవం. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరూ ఎన్నో సార్లు రుజువు చేశారు. రాజకీయాల్లో ఇక పోటీ చేయడం లేదని సుష్మా ప్రకటించినప్పుడు ఆమె భర్త చేసిన వరుస ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ‘ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న నీ నిర్ణయానికి ధన్యవాదాలు మేడమ్‌. మిల్కా సింగ్‌ కూడా ఒకానొక సమయంలో రన్నింగ్‌ను ఆపేసిన విషయం నాకు గుర్తుంది.’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘మేడమ్‌.. మన మారథాన్‌ మొదలయి 40 ఏళ్లు దాటింది.

మీరు(సుష్మా) 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 1977 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు. ఒక్క 1991, 2004 మాత్రం పోటీ చేయలేదు. నాలుగు సార్లు లోక్‌ సభకు వెళ్లారు. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మీకు 25 ఏళ్ల వయసున్నప్పటి నుంచి బిజీగానే ఉన్నారు. మేడమ్‌… నేను మిమ్మల్ని 47 ఏళ్లుగా ఫాలో అవుతున్నాను. నాకిప్పుడు 19 ఏళ్లు కాదు. నేను మీ వెనక పరుగెత్తి అలిసిపోయాను’ అని ట్వీట్లు చేసి తమ వైవాహిక బంధం ఎంత దృఢమైందో, వారిద్దరి మధ్య ఎంతటి అన్యోన్యత ఉందో చాటి చెప్పారు. ఇవే కాకుండా ఏదో ఒక సందర్భంలో తమకు ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో చాటి చెబుతూనే వచ్చారు.