శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో తెలుసా?
రక్షా బంధనం. ఈ పదమే కాల క్రమేణా రాఖీ అయింది. ఈ రోజు చెళ్లెళ్లని, చెల్లి వరస వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేసి వారు తెచ్చిన రక్షా/రాఖీ ని కట్టించుకొని తీపి పదార్ధాలు తిని ఆజన్మాంతం వారికి తోడుగా నీడగా ఉంటానని వారికి మాట ఇస్తారు అన్న తమ్ముళ్ళు. ఇది అనాదిగా వస్తున్న భారతీయ సంప్రదాయం. దీనిని ఇపుడు ఎగతాళి చేస్తున్నవారు లేకపోలేదు కానీ పవిత్రమైన ఈ సంప్రదాయం గురుంచి తెలుసుకోడం చాలా అవసరం.
సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్లు,అక్కా తమ్ముళ్ల బంధం మరింత ధృడంగా మార్చే పర్వదినం. చిన్న వయసులో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెంతన ఒకే గూటి పక్షులుగా.. కలిసి మెలిసి, ఆడుతూ,పాడుతూ పెరిగిన అక్కలు, చెల్లెండ్లు, అన్నలు, తమ్ముళ్లు.. ఆ తర్వాత తలో దిక్కుకు వెళ్లడం అనివార్యమవుతుంది. పెద్దయ్యాక ఎవరి జీవితాలు వారివిగా మారతాయి. కుటుంబాలు మారిపోతాయి. అన్నా తమ్ముళ్లు పుట్టింట్లోనే ఉంటే.. అక్కా చెల్లెళ్లు మెట్టినింటికి పంపించబడతారు.
దాదాపు 20యేళ్లు ఒక్కచోట, ఒక్కింట్లో, తల్లిదండ్రుల చెంతన బతికిన వాళ్లు.. ఆ జ్ఞాపకాలను నెమరేసుకోవడం, పండుగలు, శుభకార్యాలకు గానీ కలవక పోవడం సర్వసాధారణమవుతుంది. ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి బరువు బాధ్యతలు వాళ్లవి, ఎవరి కుటుంబం వాళ్లకు వేర్వేరవుతాయి. అయితే.. సోదర సోదరీమణుల మధుర జ్ఞాపకాలను నెమరేసుకునే అద్భుత సందర్భం రాఖీ పండుగ. చిన్నప్పుడు అల్లరిగా, బాధ్యతలు తెలియని సమయంలో చేసిన సహవాసం.. పెద్దయ్యాక బరువు బాధ్యతలు తెలిశాక కలిగే ఆప్యాయత మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతులను వర్ణించలేం. ఆ మధుర క్షణాలను స్వయంగా అనుభవించాల్సిందే…