Movies

టాలీవుడ్ అగ్ర హీరోల తొలి సినిమాలు ఇవే

తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకూ నటించిన ప్రముఖ హీరోల తొలిసినిమా గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. హీరోలు కూడా ఎంత ఎత్తుకి ఎదిగినా వాళ్ళ మొదటి మూవీ మాత్రం గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్ ,అక్కినేని రెండు కళ్లులాంటి వాళ్ళు . ఇందులో అక్కినేని ముందుగా సినిమా రంగంలోకి వచ్చారు. రొమాంటిక్ హీరోగా రాణించిన అక్కినేని 1941లో ధర్మపత్ని మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. పి పుల్లయ్య డైరెక్షన్ చేసిన ఈ మూవీలో భానుమతి,శాంతకుమారి తదితరులు నటించారు.

ఇక తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ 1949లో మనదేశం సినిమా ద్వారా తెలుగు వెండితెరపై దర్శనమిచ్చాడు. ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో నాగయ్య,ఎస్వీఆర్ వంటి వాళ్ళు నటించారు. ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో తీసిన తేనెమనసులు మూవీ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ 1968లో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్ ,అక్కినేని తర్వాత తెలుగు సినీ చరిత్ర తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి కి 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమా తొలిసినిమా. కె వాసు డైరెక్షన్ చేసాడు.

నందమూరి నటవారసుడిగా రంగప్రవేశం చేసిన బాలకృష్ణ కి తాతమ్మ కల సినిమా తొలిసినిమా. తండ్రి ఎన్టీఆర్ నటించి,దర్శకత్వం వహించిన ఈ మూవీ తో 1974లో బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని వారసుడిగా వచ్చి మన్మథుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్న నాగార్జున విక్రమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పి మధుసూదన రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1986లో వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 1986లో ఈ మూవీ వచ్చింది.