ఈ హీరోని గుర్తు పట్టారా…ఇలా ఎందుకు మారాడో చూడండి
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కే కథలపై యంగ్ హీరోలు మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా కోసం కష్టపడుతున్నాడు. హ్యాండ్‌సమ్ హీరో గోపీచంద్ కబడ్డీ అంటూ బరిలోకి దిగుతున్నాడు. ‘ఫైటర్’ అంటూ యాక్షన్ షురూ చేశాడు మరో హీరో విజయ్ దేవరకొండ. ఇంకా చాలా మంది హీరోలు, హీరోయిన్లు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌కి సై అంటున్న తరుణంలో మేమేం తక్కువా.. అంటూ తమిళ తంబీలు కూడా స్పోర్ట్స్ జోనర్‌లో బాక్సాఫీస్ వద్ద కాలు దువ్వుతున్నారు.
విలక్షణ తమిళ నటుడు ఆర్య బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమాలో నటించనున్నాడట. అందుకోసం తన బాడీని ఆరు పలకలు.. కాదు, కాదు చాలానే పలకలతో నింపేశాడు. అచ్చు హాలీవుడ్ హీరోల్ని తలపించేలా అన్నమాట. ఇంతకీ ఈ సినిమా ఇంకా అనౌన్స్ కాలేదు. కానీ, బాక్సింగ్ నేపథ్యంలో రూపొందబోయే సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడనుండగా, ఈ లోగానే ఆర్య తాజా లుక్‌ని ఆయన ప్రియమైన సతీమణి సాయేషా సైగల్ ట్విట్టర్‌లో షేర్ చేసి, సినిమా కోసం నా హబ్బీ ఎంత కష్టపడుతున్నాడో చూశారా.? అంటూ సెలవిచ్చింది.
గతంలో బన్నీ హీరోగా ‘వరుడు’ సినిమా కోసం ఆర్య విలన్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఈ తరహా ఫిట్ బాడీతో కనిపించి మెప్పించాడు ఆర్య. తర్వాత మళ్లీ ఇలాంటి పెద్ద ప్రయోగాల జోలికి పోలేదు కానీ, తాజా మూవీ కోసం మళ్లీ ఇదిగో ఇలా కష్టపడుతున్నాడన్న మాట. ఇకపోతే ప్రస్తుతం ఆర్య, సాయేషా జంటగా ‘టెడ్డీ’ మూవీలో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి చిత్రమిది. ఇదిలా ఉంటే, లేటెస్ట్ మూవీ ‘బందోబస్త్’లో ఆర్య ఇంపార్టెంట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.