సందిగ్ధంలో సునీల్ కెరీర్….ముందు జాగ్రత్త లేకపోవటమే కారణమా…?
స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ హీరోగా మారి తన ఫామ్ కోల్పోయాడు. అయినప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఇటీవల కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, బ్రేక్ మాత్రం రాలేదు. గతంలో నవ్వించినట్లుగా సునీల్ నవ్వించలేకపోతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సునీల్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ బ్రేక్ ఇవ్వడం ఖాయమని అనుకుంటే…. అది కూడా జరగలేదు.
గతేడాది అరవింద సమేత లో నటించిన సునీల్ పాత్రకు ఎక్కువ స్కోప్ లేదు. ఈమధ్య వచ్చిన అల వైకుంఠపురములో నటించినప్పటికీ సునీల్ పాత్రకు పెద్దగా గుర్తింపు లేదు. హాస్య నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ దక్కకపోవడంతో సునీల్ విలన్ పాత్రలను కూడా అంగీకరిస్తున్నాడు. అయితే అవి కూడా సునీల్ కి బ్రేక్ ఇవ్వడం లేదు. రవితేజ నటించిన డిస్కో రాజా లో సునీల్ విలన్ గా నటించాడు.
కానీ, ఆ సినిమా పరాజయం అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అవడానికి అనేక కారణాలున్నప్పటికీ సునీల్ విలనీ కూడా ఓ కారణం అని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే…. ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో కూడా సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విడుదలైతే కానీ సునీల్ విలనీకి ప్రేక్ష కాదరణ దక్కుతుందా లేదా అనేది తెలియదు.
అయితే విలన్ గా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం కూడా సులువు కాదు. ఎందుకంటే హీరోయిన్లను దిగుమతి చేసుకున్నట్టుగానే మన ఫిలింమేకర్స్ మరాఠీ.. కొంకణి.. గుజరాతి.. విలన్లను అదే పనిగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తెలుగు రాని బ్యాచ్ తో పోటీ పడి విలన్ గా గుర్తింపు తెచ్చుకోవడం మహా కష్టం. మరి సునీల్ కెరీర్ భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.