Movies

ఇప్పటి వరకూ టాలీవుడ్ లో వకీల్ సాబ్ పాత్రలో నటించిన హీరోలెవరో తెలుసా…?

గతంలో ఎందరో హీరోలు లాయర్ పాత్రలో నటించి మెప్పించగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఆయన ఫిల్మ్ కెరీర్‌లో వకీల్ సాబ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. టైటిల్‌ను బట్టే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే పవన్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు లాయర్, జడ్జ్ పాత్రల్లో నటించి మెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు ఆయన నట జీవితంలో జస్టిస్ చక్రవర్తి,సుడి గుండాలు’ వంటి ఎన్నో సినిమాల్లో లాయర్‌గా జడ్జ్‌గా నటించారు. నందమూరి తారక రామారావు కూడా ఆయన నట జీవితంలో ‘జస్టిస్ చౌదరి’, ‘లాయర్ విశ్వనాథ్’ వంటి ఎన్నో సినిమాల్లో లాయర్‌గా జడ్జ్‌గా నటించి అదరగొట్టారు.

పొట్టి ప్లీడరు సినిమాలో అలనాటి కామెడీ నటుడు పద్మనాభం ప్లీడర్ పాత్రలో టైటిల్ రోల్ పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ అశ్వత్ధామ వంటి పలు సినిమాల్లో లాయర్ పాత్రలో మెప్పించాడు. నట భూషణ శోభన్ బాబు కూడా ఎన్నో సినిమాల్లో లాయర్ పాత్రలో అదరగొట్టారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘విధాత’ వంటి పలు సినిమాల్లో లాయర్‌గా జడ్జ్‌ పాత్రల్లో మెప్పించారు. ఏ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ సినిమాలో చిరంజీవి లాయర్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే ఏ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలో నందమూరి బాలకృష్ణ వకీల్ సాబ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ జాతకుడు’ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వకీల్ సాబ్ పాత్రలో నటించాడు. ఇక విక్టరీ వెంకటేష్ ‘శత్రువు, ‘ధర్మచక్రం’ వంటి సినిమాల్లో వకీల్ సాబ్ పాత్రలో దుమ్మురేపాడు. ఇక అక్కినేని నాగార్జున కూడా ‘విక్కీదాదా’, ‘అధిపతి’ వంటి సినిమాల్లో లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు.

రాజేంద్ర ప్రసాద్.. ‘చెట్టు కింద ప్లీడరు’ సహా ఒకటి రెండు చిత్రాల్లో లాయర్ పాత్రలో మెప్పించాడు. ‘ఈ ప్రశ్నకు బదులేది’ వంటి ఒకటి రెండు సినిమాలో లాయర్ పాత్రలో రాజశేఖర్ నటించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ‘కర్ణ’ వంటి కొన్ని సినిమాల్లో లాయర్ పాత్రలో అదరగొట్టాడు. ‘ఆటగాళ్లు’ సినిమాలో వకీల్ పాత్రలో జగపతి బాబు నటించాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాలం’ సినిమాలో శ్రీకాంత్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం 1’ సినిమాలో లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు. తెనాలి రామకృష్ణ బిఎ ఎల్ ఎల్ బి సినిమాలో లాయర్ గా సందీప్ కిషన్ నటించగా, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ ‘మై డియర్ మార్తాండం’ సినిమాలో లాయర్‌ పాత్రలో టైటిల్ రోల్ పోషించాడు. కమెడియన్ సప్తగిరి. కూడా సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాలో లాయర్ పాత్రలో మెప్పించాడు. సునీల్ కూడా ఓ సినిమాలో లాయర్ పాత్రలో మెప్పించాడు.