ఉదయ్ కిరణ్ గురించి షాకింగ్ నిజాలను బయట పెట్టిన సునీల్
తెలుగు ప్రేక్షకుల మదిలో లవర్ బాయ్ గా నిల్చిన ఉదయ్ కిరణ్ మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వ దూసుకొచ్చాడు. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన అతడి జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా.
డైరెక్టర్ తేజ తీసిన ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు. ఈయన దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న నటుడు గా నిలిచాడు. అయితే అనుకోకుండా జీవితం తిరగబడిపోయింది. వచ్చిన చాన్సులు నిలబడక… కొత్త అవకాశాలు రాక ఉదయ్ కిరణ్ కెరియర్ ఎటూ కాకుండా పోవడానికి ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు. కానీ దానికి సాక్ష్యాలు లేవు. తప్పు ఎవరు చేసినా కూడా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడనుకున్న ఉదయ్ అర్ధంతరంగా వాలిపోయాడు. ఉదయ్ ఈ లోకం నుంచి దూరమై 6 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం అలాగే ఉండిపోయాడు.
అయితే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఉదయ్‌తో తనకున్న అనుబంధాన్ని కమెడియన్ సునీల్ గుర్తు చేసుకున్నాడు.ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సునీల్ కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో ఉన్నాడు. నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన సునీల్ గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమాలో ఓ రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్‌లను దర్శకుడు తేజ తీసుకొచ్చాడు. వాళ్లతో కలిసి ఉదయ్ ను పరిగెత్తాలని కోరడంతో నిజంగానే పరిగెత్తి ఫస్ట్ వచ్చాడు. దాంతో సునీల్ వెళ్లి అంత స్పీడ్‌గా ఎలా పరిగెత్తావని ఉదయ్‌ని అడిగితే.. చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటు అయిపోయిందని సరదా సమాధానం చెప్పాడు. షూటింగ్‌లో అంత సరదాగా ఉండే మనిషి ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోలేక పోతున్నానని సునీల్ బాధపడ్డాడు.