నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న అనుష్క… ఇలా అయితే ఎలా?
‘భాగమతి’ తర్వాత యోగా భామ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ ఇటు తెలుగుతో పాటు తమిళ భాషాలోను తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ విడుదలైంది. అనుష్క ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో అనుష్కతో పాటు తమిళ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్సన్… ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్ వంటి తారలు నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘నిశ్శబ్దం’ మూవీలో మొదటిసారి అనుష్క మూగ పాత్రలో నటిస్తుండటం, మాధవన్ వంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు సహజంగానే పెరిగాయి. పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్ ఉన్నాయి.అది అలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలకాలేకపోయింది.
ఇక లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సినిమాలను చూడటానికి థియేటర్స్ కి జనాలు వస్తారనేది చెప్పడం కష్టమే. అందుకే ముందు జాగ్రత్తగా కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. అయితే అమెజాన్‌కు ఈ సినిమాను అమ్మాలంటే అనుష్క అనుమతి కూడా కావాలట. కానీ ఆమె మాత్రం డిజిటల్లో విడుదలకు అంగీకరించడం లేదట. ఏప్పుడో విడుదలకావాల్సిన సినిమా అనుకున్న సమయానికి విడుదల కానుందున నిర్మాతలు నెలకి లక్షల్లో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారట. అందుకే ఈ విషయంలో ఆమె తీరు పట్ల నిర్మాతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.