రౌడీ దగ్గర బ్యాంకు బాలెన్సు లేకపోవడం ఏమిటి?నమ్మే విషయమా…!
ఈతరం హీరోల్లో సూపర్ స్టార్ ఎవరంటే… విజయ్ దేవరకొండ పేరే చెప్పాలి. వరుస హిట్లు, బోలెడన్ని ఆఫర్లు, ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. దానికి తోడు నిర్మాతగానూ మారాడు. విజయ్ పారితోషికం రూ.10 కోట్లని టాలీవుడ్ టాక్. దానికి ఓ కోటి అటూ ఇటూ ఉండొచ్చు. అలాంటి విజయ్ దేవరకొండ దగ్గర బ్యాంకు బాలెన్స్ లేకపోవడం ఏమిటి?? విచిత్రం కాకపోతే. `నా నగదు నిల్వలన్నీ అయిపోయాయి` అని విజయ్‌దేవరకొండ ప్రకటించాడు ఈమధ్య. దాంతో… ఆయన అభిమానులు, టాలీవుడ్ కూడా షాక్ కి గురైంది.
విజయ్ మామూలు హీరో కాదు. సినిమాకి పది కోట్లు. దానికి తోడు ఎండార్స్మెంట్లు. ఏ నిర్మాతకు ఫోన్ చేసినా, అడ్వాన్సుల రూపంలో కోట్లు గుమ్మరిస్తారు. కానీ… విజయ్ దగ్గర ఇప్పడు డబ్బుల్లేవట. కరోనా పై పోరాటం చేసే విషయంలో చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం కూడా స్నేహితుల దగ్గర అప్పు చేశాడట. దాంతో.. విజయ్ దగ్గర డబ్బుల్లేకపోవడం ఏమిటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే… కోట్లకు కోట్లు ఎవరూ చేతిలో నగదు పెట్టుకోరు. బ్యాంకుల్లో ఉంటాయి. ఇప్పుడు బ్యాంకులన్నీ పనిచేస్తున్నాయి. ఆన్ లైన్ ట్రాన్స్ఫర్లూ జరుగుతున్నాయి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా నగదు ఇంట్లో పెట్టుకోడు.
అర్జెంటుగా కోటి రూపాయలు కావాలంటే సర్దుకోవడానికి టైమ్ పడుతుంది. విజయ్‌దీ అదే సమస్య అని సర్దుకుపోవాలి. కాకపోతే.. సాయం చేయడానికి విజయ్ పక్కా ప్లానింగ్ తో వచ్చాడు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని.. తనదైన స్టైల్లో సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ విషయంలో రౌడీని మెచ్చుకోవాల్సిందే.