ఆచార్యకు మళ్ళీ హీరోయిన్ కష్టం వచ్చింది…ఎప్పటికి తీరతాయో కష్టాలు
కొన్ని సినిమాలకు అనుకోని అడ్డంకులు కూడా వస్తుంటాయి. అది స్టార్ట్ చేసిన ముహూర్త బలాన్ని బట్టి ఉంటుందని అంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 152వ ప్రాజెక్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. ఆచార్య పేరుతొ దీన్ని తెరకెక్కిస్తున్నారు. 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తర్వాత వచ్చిన సైరా చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కుదరలేదు. దాంతో దాదాపు ఏడాది కాలం పాటు దర్శకుడు కొరటాల శివ ఎదురు చూసాడు. ఇక సైరా చిత్రం విడుదలైన తర్వాత కూడా దాదాపుగా మూడు నాలుగు నెలల వరకు ఎదురుచూశాడు. ఏదైతేనేం మొత్తానికి స్టార్ట్ అయిన ఈమూవీ షూటింగ్ వంద రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తామన్నారు.
షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే హీరోయిన్ త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి వెళ్లి పోయింది. త్రిష స్థానంలో ఎవరిని తీసుకుందాం అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ మొత్తం ఆగిపోయింది. పలువురు హీరోయిన్స్ తో చర్చలు జరిపిన తర్వాత చివరకు కాజల్ అగర్వాల్ తో చిరు రొమాన్స్ కు సిద్దం అయ్యాడు. కాజల్ కూడా తాను ఆచార్య చిత్రంలో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కాజల్ నటించడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముఖ్యంగా తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కు జోడీగా కాజల్ ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందట. భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ఎప్పుడంటే అప్పుడు డేట్లు ఇచ్చేలా కమిట్ అయ్యిందట. దాంతో లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే రెండు నెలల పాటు ఆ సినిమాకే ఈమె డేట్లు ఇవ్వాల్సి వస్తుందట. అందుకే ఆచార్య చిత్రానికి డేట్లు అడ్జెస్ట్ చేయలేక పోతున్నట్లు చెప్పి తప్పుకుంటుందని టాక్. అయితే కొందరు మాత్రం ఆచార్యలో హీరోయిన్ పాత్ర మరీ కూరలో కరివేపాకు మాదిరిగా ఉందని అందుకే త్రిష మాదిరిగా కాజల్ కూడా నటించేందుకు నో చెప్పిందని, ఇప్పుడు కాజల్ కూడా అదే బాటలో వెళుతోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై క్లారీటి రావాలి.