Movies

ఎన్టీఆర్,చిరంజీవి లతో సినిమాలు తీసిన ఈ నిర్మాతను గుర్తు పట్టారా…?

అసలు ఐదు దశాబ్దాలుగా ట్రెండ్‌కు తగ్గట్టు సినిమాలను నిర్మిస్తూ అదే స్థాయిలో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంస్త వైజయంతీ మూవీస్. ఈ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ అగ్ర నిర్మాత గా ఎదిగారు. సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబులతో సినిమాలు నిర్మించాడు. ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి కథానాయికులతో భారీ చిత్రాలను తెరకెక్కించాడు. మూడో జనరేషన్‌లో ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించిన ఘనత ఈయనదే. అశ్వినీ దత్ తెలుగు లో తొలిసారిగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కొంత మంది భాగస్వామ్యంతో 1974లో ‘ఓ సీత కథ’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సోలోగా ఎన్టీఆర్‌తో తొలి సినిమాగా ‘ఎదురులేని మనిషి’ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు కజిన్ కే.బాపయ్య దర్శకత్వంలో నిర్మించారు.

ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. మాములుగా చాలా మంది నిర్మాతలు ఏదో కొన్ని సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ అశ్వనీదత్ అలాంటి ఇలాంటి ప్రొడ్యూసర్ కాదు. తను ఏ సినిమా తీసినా భారీ హంగులు, ఆర్భాటాలు ఖచ్చితంగా పెడతారు. కొన్నిసార్లు వీటితో దెబ్బ తిన్నా.. ఎక్కువ సార్లు మాత్రం అలాంటి చిత్రాలతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిట్ట. ఇంతకీ అశ్వినీదత్ బ్యానర్ కి ఎవరు పేరు పెట్టారంటే ఎన్టీఆర్‌. అవును ఎన్టీఆర్ తో సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఆయన్ని కలిసి ఆయనతో సినిమా తీయాలనుకుంటున్నట్టు అశ్వినీదత్ చెప్పారు. దత్ చెప్పిన మాటలకు ఎన్టీఆర్ చాలా ఇంప్రెస్ అయి ఆయనతో సినిమా చేయడానికి ఒప్పకున్నారు. అప్పటి వరకు బ్యానర్ స్థాపించలేదు.

అప్పుడు అన్నగారు మీ బ్యానర్ పేరు ఏమిటి అని అడిగారు ? ఇంకా పెట్టలేదు అని చెప్పాడు. అప్పటికప్పుడు ఎన్టీఆర్ అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటో చూసి, శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలు వెదజల్లూతూ ఎన్నటికీ వాడిపోని పూల మాట వైజయంతి. అదే నీ సంస్థ పేరు అని చెప్పారు. అంతే కాదు తన స్వహస్తాలతో వైజయంతీ మూవీస్ అని రాసారు. ఈ బ్యానర్ లోగోలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో ఉంటుంది.కేవలం రాయడమే కాదు. వైయజంతి అప్పటి నుంచి వాడిపోకుండా తెలుగులో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ హస్తవాసితో ఎదురులేని మనిషి సినిమాతో ప్రారంభమైన ఈ బ్యానర్‌కు ఎదురులేకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం అశ్వనీదత్.. తెలుగులో ప్రభాస్ హీరోగా మహానటి సినిమాతో తన కంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీకి రంగం సిద్ధంచేశారు.