Movies

కాఫీలో నానబెట్టి మరీ బన్నీ బట్టలు ఉతుకుతున్నారు…ఎందుకో చూడండి

‘అల వైకుంఠపురంలో’ సినిమా విజయంతో జోష్ మీదున్న అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. చాలా రోజులు క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా జరిగిన షెడ్యూల్స్ లో బన్నీ లేని సీన్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బన్నీ – సుక్కు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక వీరిద్దరి గత చిత్రాలు మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో ‘పుష్ప’పై కూడా ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.

అయితే ప్రపంచమంతా కమ్మేసిన కరోనా మహమ్మారి వచ్చి ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసింది. సుక్కు ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాడు. ‘పుష్ప’ పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ అవతారం లో దర్శనమిస్తాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇలా చూపించడం కోసం చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది.

కరోనా కారణంగా అనుకోకుండా దొరికిన ఈ సమయంలో చిత్ర యూనిట్ కథా కథనాలకు మరింతగా మెరుగు పెట్టే పనిలో పడ్డారు. తాజాగా బన్నీ కాస్ట్యూ మ్స్ కి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ వినియోగించబోయే కాస్ట్యూమ్స్ ని రెండు రోజుల పాటు కాఫీలో నానబెట్టి తరువాత ఉతికి ఆరబెడుతున్నారట. ఓల్డ్ లుక్ కోసం ఇలా చేస్తున్నారట. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.