‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పై ఎన్టీఆర్ రివ్యూ
టాలీవుడ్ అద్భుత మూవీస్ లో ఒకటైన ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ సినిమా విడుదలై ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. ఈ విజువల్ వండర్ రిలీజై 30 ఏళ్ళైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్టు వైజయంతి మూవీస్ అశ్వినీదత్ తెలిపారు. ఇప్పటికే అందులో మొదటి రెండు స్టోరీలను నాని వాయిస్ ఓవర్ తో వింటేజ్ వైజయంతి వీడియో విడుదల చేసారు. ఇప్పుడు నాని వాయిస్ ఓవర్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూడో స్టోరీ విడుదల చేసారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి.. మాములు సినిమా కాదు. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో ఈ చిత్రాన్ని అతి పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. అప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ సరిగ్గా కుదిరాయి అన్న సమయానికి మే 6వ తేదిన తుఫాను వార్తలు మొదలయ్యాయి. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలీని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. దీంతో తుఫాన్ ను ఎదిరించి థియేటర్లలో సినిమా విడుదల చేశారు. అయితే భారీ వర్షాలతో పలు థియేటర్లలోకి ప్రొటెక్టర్ రూమ్ లోకి నీళ్లు కూడా పోయాయి. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమా నీటి పాలవుతుందని.. చేసిన ప్రమోషన్లు వరద నీళ్లలో కొట్టుకుపోతాయని అశ్వనీదత్ ఆలోచించారు. తరువాత జరగాల్సిన వాటి గురించి అశ్వనీదత్ – రాఘవేంద్రరావు విజయవాడ వెళ్లారు. మరుసటి రోజు ఇద్దరూ గుంటూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారట.
అక్కడ క్లాస్ ఆడియెన్స్ మాస్ ఆడియెన్స్ లా చప్పట్లు ఈలలతో రెచ్చిపోతున్నారట. అప్పుడే మరో మరుపురాని సంఘటన జరిగింది సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉండగా.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ వారికి ఎదురుపడ్డారట. ఆసమయంలో ‘సినిమా రిపోర్ట్ బావుంది. సెటిల్ అయిపోతావు. కంగారు పడకు. నేను చెప్తున్నా’ అని ధైర్యం చెప్పి ఎంటీఆర్ తన ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోయారట. అంతేకాకుండా అప్పుడే సైకిల్ పై అరటి పళ్లతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ‘ఇప్పుడే సినిమా చూశా. అదిరిపోయింది. సంవత్సరం ఆడుతుంది’ అని అరవడంతో అశ్వినీ దత్ – రాఘవేంద్రరావు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారట. ఇక అక్కడి నుంచి ఈ సినిమా తుఫాను వర్షం ఏదీ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరిని ఆపలేకపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో తుఫానుగా వచ్చిన ఈ చిత్రం వచ్చి 30 ఏళ్లయింది. ‘వియ్ మిస్ యూ అతిలోక సుందరి’ అంటూ శ్రీదేవికి నివాళులు అర్పించారు. ఈ ల్యాండ్ మార్క్ సినిమాలో కొన్ని డౌట్స్ ఇంకా వెంటాడుతున్నాయి. అవేంటంటే.. ఉంగరం ఏమైంది.. ఉంగారాన్ని మింగిన చాప ఏమైంది..” అంటూ నాని కథ చెప్పడం ముగించాడు.