గౌతమ్ ఘట్టమనేని.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడు?
ఘట్టమనేని కృష్ణ వారసత్వాన్ని అక్షరాలా పుణికి పుచ్చుకున్నాడు మహేష్‌బాబు. సూపర్ స్టార్ గా… కృష్ణ స్టార్ డమ్‌ని కాపాడుకుంటూ, ఆ మాటకొస్తే.. ఓ మెట్టు పైనే నిలబడ్డాడు. ఆ తరానికి మహేష్ అంటే కృష్ణగారి అబ్బాయి కావొచ్చు.
కానీ ఈ తరానికి మాత్రం కృష్ణ అంటే మహేష్ వాళ్ల నాన్ననే. అంతటి క్రేజ్ మహేష్ సొంతం అయ్యింది. ఇప్పుడు ఘట్టమనేని నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. తనే.. గౌతమ్.
ట్విట్టర్, ఇన్‌స్ట్రాలలో మహేష్ తన ఫ్యామిలీ ఫొటోల్ని తరచూ పంచుకుంటున్నాడు. అందులో మహేష్ తనయుడు గౌతమ్‌ని చూస్తే తెగ ముచ్చటేస్తోంది.
అందంలోనూ, రూపంలోనూ మహేష్‌కి ఏమాత్రం తీసిపోడు గౌతమ్. వన్ – నేనొక్కడినే సినిమాలోనూ గౌతమ్ కనిపించాడు.
గౌతమ్ కూడా హీరో అవుతాడని, అవ్వాలని మహేష్ అభిమానుల ఆశ. ఆ విషయాన్నే మహేష్ ముందు బయటపెట్టారు. ఆదివారం మహేష్‌బాబు ఇన్‌స్ట్రాలో సరదాగా తన అభిమానులతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా గౌతమ్ ప్రస్తావన వచ్చింది. గౌతమ్ కూడా హీరో అవుతాడా? అని ఓ అభిమాని అడిగితే.. తన దృష్టిలో ఆ ఆలోచన ఉందేమో? దానికి కాలమే సమాధానం చెప్పాలి..
అని చెప్పుకొచ్చాడు మహేష్. గౌతమ్ ఎంట్రీ ఖాయం. కానీ దానికి చాలా సమయం ఉంది. కాకపోతే.. ఈలోపు చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఎందకంటే మహేష్ కూడా హీరో కాకముందే బాలనటుడిగా మెప్పించినవాడే. ఇప్పుడు గౌతమ్ కూడా అదే దారిలో నడుస్తాడేమో చూడాలి.