Movies

అనుమతి ఇస్తున్నా స్టార్స్ రిస్క్ కి సిద్ధంగా లేరట…ఇప్పట్లో సినిమాలు లేనట్టే… !

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ తో సినీ ఇండస్ట్రీ గత రెండున్నర నెలలుగా మూతబడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులు నిబంధనలతో మాత్రమే చిత్రీకరణకు అనుమతిస్తున్నాయి. సడలింపులు ఇస్తున్నా కూడా నటీనటులు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారట. అంతేకాకుండా మరికొన్ని రోజులు బయటికి రాలేమనే సంకేతాలు ఇస్తున్నారట. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు జీవోలు జారీ చేసాయి. దీంతో షూటింగ్స్ ఆపేసుకున్న చిత్రాలు చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి.. ఫస్ట్ ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.. ఏ స్టార్ హీరో తొలుత మేకప్ వేసుకుంటాడు.. ఇప్పుడు ఈ విషయాలపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అసలు టాలీవుడ్ లో ఇప్పట్లో సినిమా షూటింగ్ ల సందడి మొదలవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంకన్నా ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోవడం.. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో రిస్క్ తీసుకోవడానికి నటీనటులు సిద్ధంగా లేరట. అందుకే వేచి చూసే ధోరణి అవలంభించి ఆగస్టు నాటికి పరిస్థితులు చక్కబడితే అప్పటి నుంచి షూటింగ్ లో పాల్గొనాలని ఆలోచిస్తున్నారట. దీంతో మేకర్స్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చేసుకుంటున్న సన్నాహాలు ఆపేసుకుంటున్నారట. అయితే కొన్ని సినిమాల నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటున్నారట. కాకపోతే ఒకటి అర చిన్న సినిమాలు మాత్రం షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారట.

మొత్తం మీద టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు మునుపటి వేగంగా ఇప్పుడే ప్రారంభమయ్యే పరిస్థితి లేదని ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితులు కనిపించడం లేదు.. రీ ఓపెన్ అయినా ప్రేక్షకులు ఒకప్పటిలా వస్తారో లేదో అనే సందేహం ఉండనే ఉంది. ఇప్పటికిప్పుడు రిస్క్ చేసి సినిమాల్ని సిద్ధం చేసి పెట్టుకున్నా వాటితో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని అనుకుంటున్నారట. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సాహసం చేసి సెట్లోకి దిగడం కంటే మరికొన్నాళ్లు వేచి చూడటమే మంచిదని భావిస్తున్నారట. అయితే కొంతమంది హీరోలు షూటింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాక్టర్స్ టెక్నీషియన్స్ ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం, ప్రయాణాల విషయంలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆలోచనలో పడ్డారట.