రిస్క్ చేస్తున్న గోపీచంద్…ఈ సమయంలో అవసరమా…?
ఒకప్పుడు టి కృష్ణ అంటే హిట్ చిత్రాల డైరెక్టర్. ప్రతిఘటన లాంటి ఎన్నో హిట్స్ ఇచ్చిన టి కృష్ణ తనయుడైన గోపీచంద్ ఇండస్ట్రీలోకి హీరోగా వద్దామనుకుంటే విలన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా. అందుకే అనూహ్యంగా హీరో అయ్యాడు. లక్ష్యం లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అయితే లౌక్యం తర్వాత పాపం ఒక్క హిట్ రాలేదు.
ఎలాగైనా హిట్ కొట్టాలని పరితపిస్తున్న గోపీచంద్ క్రీడా నేపధ్యం గల సిటీమార్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మిల్కి బ్యూటీ తమన్నా జోడీ కడుతున్న ఈ మూవీని డైరెక్టర్ సంపంత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఎపి గాళ్స్ కబడ్డీ జట్టుకి నాయకత్వం వహించే పాత్రలో గోపీచంద్ కనిపించబోతున్నాడు.
ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ కి కరోనా ఎఫెక్ట్ తగిలింది. ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ తో సినిమాలన్నీ మూతపడ్డాయి. ఎక్కడివి అక్కడే ఆపేయడంతో ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే కొన్ని షరతులతో షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినా సరే, చాలామంది స్టార్ హీరోలు దూరంగానే ఉంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ షూటింగ్ కి దూరంగా ఉంటుండగా గోపీచంద్ రిస్క్ చేస్తాడా లేదా అనేది చూడాలి.