Movies

జయలలిత బయోపిక్ లో నిత్యామీనన్ నటించడానికి అదే కారణం అట

టాలీవుడ్ లో ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తొలి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసింది. నిత్యం టాలీవుడ్ లో మరో సౌందర్య అనిపించుకునే ఈ అమ్మడు అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయిన నిత్య తన బ్రాండ్ చూపించింది అని చెప్పాలి. ప్రస్తుతం నిత్యా మీనన్ జయలలిత బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది.ఐరన్ లేడీ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతుంది.

నిజానికి ఈ మధ్యకాలంలో ఈ భామకి హీరోయిన్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కాస్తా కొంచెం బొద్దుగుమ్మ గా మారిపోయింది. ఇక ఈమె కూడా గతంలో మాదిరి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, మనసుకి నచ్చే పాత్రలు వస్తేనే ఒకే చెబుతోంది. అయితే ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు నిత్యా షేర్ చేసుకుంది. జయలలిత బయోపిక్ చాలామంది ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కించడంతో మొదటగా తాను సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పింది. తన అభిప్రాయాన్ని దర్శకురాలు ప్రియదర్శినీతో కూడా చెప్పానని, అయితే ఈ సినిమా విషయంలో ఆమె ఇచ్చిన క్లారిటీ తనకు నచ్చడంతో చేయడానికి ముందుకు వచ్చానని చెప్పింది. జయలలిత మీద ఎంతమంది ఎన్ని సినిమాలు తీసిన, అందుకు భిన్నమైన కథ మన సినిమాలో ఉంటుందని ఆమె చెప్పడంతో ఈ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించడానికి ఒకే చేసానంది. మరి ఏ కోణంలో చూపిస్తారో చూడాలి.