ఓటీటీ వైపు టాలీవుడ్ మొగ్గు చూపడం లేదా…కారణాలు అనేకం
కరోనా కష్టకాలంలో అన్ని దెబ్బతిన్నట్టే సినిమా రంగం కూడా ఘోరంగా దెబ్బతింది. థియేటర్లు మూతపడ్డాయి. సినిమాలు తీసి కూడా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి కొందరిదైతే,సగంలోనే ఆగిపోయిన సినిమాలు కొన్ని, చివరి దశలో ఆగిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. ఇక సెట్స్ మీదికి రానివి చాలానే ఉన్నాయి. అయితే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద సినిమాలు రిలీజ్ చేయడానికి కొందరు ముందుకొస్తున్నా, మరికొందరు వెనుకంజ వేస్తున్నారు.
ఇప్పటికే ఓటీటీ లో సుధీర్,నానీల ‘వి’ మూవీ రిలీజయింది. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. వి మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. అలాగే పలు సినిమాలు ఓటీటీ లో విజయం సాధించిన దాఖలాలు లేవని, అందుకే ఓటీటీ అంటే చాలామంది భయపడుతున్నారని,థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే రిలీజ్ చేయాలని మన హీరోలు పట్టుబడుతున్నారని టాక్.
పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఎలాగోలా సొమ్ము చేసుకోవాలని ఓటీటీ వైపు మొగ్గుచూపాలని ప్రయత్నం చేస్తున్నా, హీరోల కోరిక మేరకు వెనక్కి తగ్గుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు, తెరిచినా మునుపటిలా జనం ఎగబడి చూస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే ఎటూ పాలుపోక అవస్థలు పడుతున్నారు. అయితే మొదట్లో జనం థియేటర్ కి రాకున్నా మెల్లిగా అలవాటు పడతారని అనే వాదన కూడా వినిపిస్తున్నారు. మొత్తానికి ఓటీటీ వైపు వెళ్ళడానికి మాత్రం జంకుతున్నారు.