Health

వాకింగ్(నడక) ఎందుకు చేయాలి?

ఎక్సర్ సైజ్ లలో నడకను మించిన తేలికపాటి వ్యాయామం ఏది లేదు. ఏ వయస్సు వారైనా, ఎప్పుడైనా,ఎక్కడైనా నడకను కొనసాగించవచ్చు. దీని కోసం పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పై పెచ్చు మిగతా వ్యాయామాల కన్నా సురక్షితమైనది. నడక వలన బరువు తగ్గటంతో పాటు ఎన్నో ఉపయోగాలు,మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గుండె పనితీరును క్రమబద్దం చేయటంతో పాటు,ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది. ఎముకల పట్టుత్వానికి సహాయపడుతుంది. ఎటువంటి కారణం లేకుండా భాదించే ఒత్తిడి,ఆందోళన వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారి తీస్తున్నాయి. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. బరువును తగ్గించుకోవటానికి నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. ఒక పౌండ్ బరువు పెరగటం అంటే అదనంగా 3500 కేలరీలు శరీరంలోకి వచ్చి చేరినట్లే. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడిస్తే వారంలో ఒక పౌండ్ తగ్గే అవకాశం ఉంది.

ఒక మైలు(సుమారు ఒకటిన్నర కిలో మీటర్లు) దూరాన్ని 13 నిముషాల కంటే తక్కువ సమయంలో నడిస్తే ఎక్కువ కేలరీలను కరిగించుకోవచ్చు. ఒక మైలు దూరం నడిస్తే 100 కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ లెక్కనా ఎంత బరువు తగ్గాలని అనుకుంటారో…. అన్ని మైళ్ళు ప్రతి రోజు నడవాలి.