Movies

బాలు,అజిత్ ఫ్యామిలీకి గల లింకు ఇదే… ఈ విషయం ఎవరికీ తెలియదు

వేలకు వేలు పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలుసుబ్రహ్మణ్యం ఇక లేరనే విషయం సంగీత ప్రపంచం ఇంకా నమ్మలేక పోతోంది. అందరితో ఆత్మీయంగా ఉండే ఆయనతో గల అనుబంధాన్ని అందరూ తలుచుకుంటూనే ఉన్నారు. భౌతికంగా లేకున్నా బాలు పాట మాత్రం ఈ లోకంలో అనుక్షణం వినిపిస్తూనే ఉంటుంది. అయితే బాలు చనిపోయిన తర్వాత టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎవ్వరూ ఆయనని చూసేందుకు వెళ్లలేదు. తమిళ స్టార్ స్టార్‌ హీరో విజయ్‌, అర్జున్‌ వంటి వారు మాత్రమే బాలు అంత్యక్రియలకు వెళ్లారు. ఇక బాలుకి అంత్యంత సన్నిహితుల్లో తమిళనాట అజిత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.

దీనికి పెద్ద కారణమే ఉంది. అందుకే బాలు అంత్యక్రియలకు అజిత్‌ ఎందుకు హాజరు కాలేదనే మాట కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా ఈ విషయమై బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు.’ ప్రస్తుతం ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు’ అని ఆలోచించే రోజులు కావని, కరోనా ‌ మహమ్మారి కారణంగా ఎవరూ వచ్చినా, రాకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేసాడు. అయితే అసలు స్టార్‌ హీరో అజిత్‌కు, బాలు ఫ్యామిలీకి ఉన్న బంధం విషయానికి వస్తే, .. చరణ్‌, అజిత్‌లు స్కూల్‌ మేట్స్. అందుకే చిన్నప్పుడు అజిత్‌ ఎక్కువగా బాలు వాళ్ల ఇంట్లోనే ఉండేవాడట.

అంతేకాదు, అజిత్‌ సినిమా ప్రస్థానం కూడా ఎస్‌.పి. బాలు రికమండేషన్‌తోనే మొదలైందట. అవును నిజమే. ఓసారి మోడలింగ్‌ షాట్‌ కోసం.. చరణ్‌ చొక్కా తీసుకునేందుకు వచ్చిన అజిత్‌ని బాలు బాగా గుర్తుపెట్టుకున్నారట. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాసరావు డైరెక్షన్లో తీస్తున్న సినిమాకి హీరోని వెతుకుతున్నారని తెలిసి.. అజిత్‌ పేరును బాలు సిఫార్సు చేసాడట. అలా అజిత్‌ హీరోగా అవతారం ఎత్తాడు. అజిత్‌ నటించిన తెలుగు స్ట్రయిట్‌ చిత్రమిదే. అదే ‘ప్రేమ పుస్తకం’. అలా అజిత్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి బాలు కారణమయ్యారు. అప్పటి నుంచి అజిత్‌, బాలు ఫ్యామిలీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. అందుకే బాలు చివరి చూపు విషయంలో అజిత్‌ ఎందుకు రాలేదనే విషయం చర్చకు దారితీసింది.