సినిమాల్లో హైపర్ కి తేడా ఎందుకు కొట్టింది… అసలు కారణం ఇదేనట
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది పేరు వింటే పంచ్ మీద పంచ్ డైలాగులు పడుతూనే ఉంటాయి. జబర్దస్త్ లో వేసిన ప్రతి స్కిట్ హిట్టే . అయితే ఇప్పుడు యితడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. వెండితెరపై కూడా వెలిగిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎక్కడో తేడా కొట్టినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే, సినిమాల్లో ఊహించినంతగా మెప్పించ లేకపోతున్నాడు. టీవీల్లో దుమ్ము దులిపేస్తున్న హైపర్ ఆది కామెడీ.. సినిమాల్లోకి వచ్చేసరికి లెక్కతప్పుతోంది.
హైపర్ అది కి మాత్రమే ఇలా జరుగుతోందా అంటే, జబర్దస్త్ కమెడియన్స్ కి అసలు ఏమాత్రం సినిమాలు చ్ఛివచ్చినట్లు కన్పించడం లేదు. వీళ్ల కామెడీ బుల్లితెర వరకు ఎంజాయ్ చేస్తున్నా కూడా పెద్దతెరపై మాత్రం ఆడియన్స్ రివర్స్ గేర్ వేస్తున్నారు. ఇక ప్రేక్షకులు చూడకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అందుకే హైపర్ ఆది కూడా సినిమాల్లో వెలవెల బోతున్నాడు. గతేడాది వెంకటేష్, నాగ చైతన్య వెంకీ మామలో హైపర్ ఆది ఉన్నా ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాడు. టీవీలో కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్లు సినిమాల్లో ఆకట్టుకోలేక పోతున్నారని తేలిపోయింది.
అలాగే చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు బుల్లితెర మీద రాణిస్తున్నప్పటికీ సినిమాల్లో కనీస గుర్తింపు కూడా నోచుకోవడం లేదు. ఇప్పుడు ఆది కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. ఆ మధ్య అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి సినిమాలో హైపర్ ఆది నటించినప్పటికీ జనానికి ఎక్కలేదు. పైగా దానికి కథా సహకారం కూడా ఇతగాడే అందించాడు. ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ తొలిప్రేమ హిట్ కొట్టినా కూడా పెద్దగా కలిసి రావడం లేదు. తొలిప్రేమ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి హైపర్ ఆదికి ఆఫర్ ఇచ్చాడు. అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో పెద్ద పాత్రే చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని రంగాలు కొందరికి అచ్చొచ్చినట్లు కొన్ని రంగాలు అచ్చి రావేమో మరి.