చెప్పినా వినకుండా ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడట
vijay devarakonda : సినిమా పరిశ్రమలో ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో కొమ్ములు తిరిగినవాళ్ళే చెప్పలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే వద్దని చెప్పినా కొందరు అనవసరమైన ప్రాజెక్టులు నెత్తిన పెట్టుకుని ఘోరంగా దెబ్బతిన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందులో విజయ్ దేవరకొండ గురించి కూడా చెప్పాలి. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుల్లో ఇతని పేరు చెప్పి తీరాలి. ఎందుకంటే, సహాయ నటుడిగా చిన్న పాత్రలు చేసి తర్వాత హీరోగా అవతారం ఎత్తి తోలి సినిమాతోనే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక రెండో సినిమా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి తన స్టామినా చూపడంతో ఫాన్స్ ఏర్పడ్డమే కాదు, దర్శక నిర్మాతలు కూడా అతడి వెంటపడ్డారు. పైగా “గీత గోవిందం” సినిమాతో వంద కోట్లు కలెక్షన్స్ అందుకుని, మంచి స్క్రిప్ట్స్ తో తన రేంజ్ నెమ్మదిగా పెంచుకున్నాడు. అంతేకాదు, హీరోగా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి, మొదటి సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే మూవీ నిర్మించాడు.అయితే ఆ సినిమా యావరేజ్ గా మిగిలి, విజయ్ కి ఆర్ధికంగా నష్టాలని తెచ్చిపెట్టింది.
‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఈ మూవీ గురించి విజయ్ ప్రస్తావించినప్పుడే నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎవరు థియేటర్ కి రారు సరికదా, పెట్టిన డబ్బులు కూడా రావు, అలాంటప్పుడు ఎందుకు ఇంత రిస్క్ అని తరుణ్ నచ్చజెప్పాడట. అయితే నువ్వు అయితేనే ఆ కథకు సరిపోతావని , దర్శకుడికి నాకు ఈ కథ మీద నమ్మకం ఉందని చెప్పి నన్ను హీరోగా చేయటానికి ఒప్పించాడని, చివరికి తాను అనుకున్నట్లుగానే సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదని తరుణ్ భాస్కర్ వివరించాడు.