నాగార్జున ఎంత మంది దర్శకులను పరిచయం చేశాడో…?
tollywood directors :టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సొంత ఇమేజ్ తెచ్చుకోవడమే కాదు, ఎందరో డైరెక్టర్లను ఇండస్ట్రీకి వచ్చేలా ఛాన్స్ ఇచ్చారు. ఇలా చాలామంది హీరోలు ఉన్నా, నాగ్ శైలి భిన్నమైనది. సంకీర్తన మూవీతో కె విశ్వనాధ్ శిష్యుడు గీతాకృష్ణ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత శివ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పరిచయం చేశారు. ఈ సినిమాతో తెలుగులో వర్మని పరిచయం చేసిన నాగ్, శివ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా వర్మని డైరెక్టర్ గా ఎంట్రీ ఇప్పించారు.
జైత్రయాత్ర సినిమాతో ఉప్పలపాటి నారాయణరావును పరిచయం చేయగా, రచ్చకన్ అనే తమిళ మూవీతో ప్రవీణ్ గాంధీ అనే కొత్త వ్యక్తిని కోలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా తెలుగులో రక్షకుడు పేరుతో రిలీజైంది. అంతేకాదు, నిర్ణయం మూవీతో మలయాళ దర్శకుడు ప్రియ దర్శన్ ను పరిచయం చేయగా, కిల్లర్ మూవీతో ఫాజిల్ ని దర్శకుడ్ని, శాంతి క్రాంతి సినిమాతో వి.రవిచంద్రన్, చైతన్య మూవీతో ప్రతాప్ పోతన్ ను పరిచయం చేసారు. బాలీవుడ్ ని శాసిస్తున్న మహేష్ భట్ ను కూడా క్రిమినల్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత నాగ్ దే.
నాగ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కొత్త డైరెక్టర్లను పరిచయం చేసారు. “శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి” సినిమాతో దర్శకుడు వైవియస్ చౌదరిని పరిచయం చేశారు. ఆ తర్వాత ఇదే దర్శకుడితో సీతారామరాజు సినిమా తీసి, హరికృష్ణతో కల్సి నాగ్ నటించారు. నువ్వు వస్తావని సినిమాతో వంకినేని రత్న ప్రతాప్, నిన్నే ప్రేమిస్తా సినిమాతో ఆర్.ఆర్.షిండే లను వెండితెరకు పరిచయం చేశారు. ఎదురులేని మనిషితో జొన్నలగడ్డ శ్రీనివాసరావును దర్శకుడిగా పరిచయం చేయగా, సంతోషం సినిమాలో దశరథ్ కు ఛాన్సిచ్చారు.
అగ్ని వర్ష సినిమాతో అర్జున్ సజ్నని అనే డైరెక్టర్ ని బాలీవుడ్ కి పరిచయం చేశారు. మాస్ మూవీతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కు దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు లారెన్స్ తనదైన శైలిలో హారర్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కేడీ మూవీతో కిరణ్ అనే డైరెక్టర్ ను, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ ను టాలీవుడ్ కి ఎంట్రీ ఇప్పించారు. అలాగే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ తో నాగ కోటేశ్వరరావు అనే దర్శకుడ్ని పరిచయం చేశారు. ఈ మూవీలో నాగార్జున నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక తాజాగా వస్తున్న వైల్డ్ డాగ్ మూవీతో అశిషోర్ సాల్మన్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు.