నర్సింగ్ యాదవ్ చివరి కోరిక నెరవేరలేదట…అది ఏమిటో తెలుసా?
Actor Narsing Yadav :మహమ్మారి కరోనా కారణంగా కొందరు, అనారోగ్యం కారణంగా మరికొందరు సినిమా నటులు మరణించగా, ఇక ఆర్ధికంగా సినీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిని, ఇలా రెండు విధాలా నష్టపోయింది. ఇక మరణించిన ప్రముఖుల్లో ప్రధానంగా డిసెంబర్ చివరి వారంలో నటుడు నర్సింగ్ యాదవ్ హఠాత్తుగా మరణించారు. ఓపక్క విలనిజాన్ని పండిస్తూనే మరోపక్క కామెడీని కూడా అదరగొట్టిన నటుల్లో నర్సింగ్ యాదవ్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఆయన భార్య చిత్ర సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఇద్దరిదీ లవ్ మేరేజ్ పైగా పెద్దలు ఒప్పుకున్న లవ్ మ్యారేజ్ కావడం మరో విశేషం.
ఈమధ్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర పలు అంశాలను షేర్ చేసుకుంది. ‘మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. కానీ పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. నా కోసం మూడేళ్లు ఎదురుచూశాడు. చివరకు ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించాడు. ఆ తర్వాత అందరి సమక్షంలోనే పెళ్లయింది. నర్సింగ్ ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. ఆయనలో నాకు నచ్చింది అదే. మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని సజీవంగా ఉంచాడు. నేను లేకపోతే ఆయనకు రోజు గడవదన్నట్లు ఉండేది’ అని చెప్పుకొచ్చింది.
తనంటే ఆయనకి పంచ ప్రాణాలని ‘చిత్రా ‘ అంటూ రోజుకు లక్షసార్లు పిలిచేవాడని, ఇలా ప్రతీ చిన్న పనికీ పిలుస్తుండటంతో విసుగొచ్చిన సందర్భాలున్నాయని, ఇక ఎప్పుడూ నీ జపమే చేస్తాడని ఆడపడుచులు ఆటపట్టించేవారని అయితే ఆయన పిలుపులో ప్రేమ వెంటనే అర్థమయ్యేదని ఆమె ఎమోషన్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మను గురువులా, చిరంజీవిని ప్రాణంలా నర్సింగ్ ఆరాధిస్తాడని చెప్పింది. అయితే మంచాన పడకుండా, నటిస్తూనే తుది శ్వాస విడవాలి అనేవాడని, ఆరోగ్యం నయమైతే నటించాలని ఆఖరి రోజుల్లో కూడా నటించాలని ఎంతో తాపత్రయపడ్డాడని చిత్ర పేర్కొంది. కానీ, మళ్లీ నటించాలన్న కోరిక తీరకుండా వెళ్లిపోవడం తనను ఎక్కువగా బాధిస్తోందని చిత్ర ఎమోషన్ అయింది.