అగ్ర నటులనే కాదన్న అలనాటి అందాల తార…కారణం అదేనట…?
Ntr anr punishment to jamuna :తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో హీరోని, ఒక్కో హీరోయిన్ ని చూసినపుడు ఫలానా పాత్రకు వీళ్ళు అయితేనే సూటవుతారని అన్పించడమే కాదు, అలా మెప్పించి చెరగని ముద్ర వేసుకున్నారు కూడా. కృష్ణుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రలనగానే ఎన్టీఆర్, ఘటోత్కచుడు వంటి పాత్రలకు ఎస్వీఆర్, దేవదాసు లాంటి పాత్రలకు అక్కినేని, గూఢచారి పాత్రలకు కృష్ణ … ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇక ఏ పాత్రనైనా అవలీలగా పోషించే మహానటి సావిత్రి ,భానుమతి వంటివాళ్ళు తమ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇక సత్యభామ అనగానే అందరి మదిలో మెదిలే నటి అలనాటి తార జమున.
చదువుకునే సమయంలో నాటకాలపై ఎక్కువ ఆసక్తి చూపడం వలన, పైగా ప్రజా దర్శకుడు రాజమండ్రికి చెందిన గరికపాటి రాజారావు నాటక సమాజం నుంచి పుట్టిల్లు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన జమున ‘గోదారి గట్టుందీ .. ‘అంటూ మూగమనసులు మూవీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ పాటను గుర్తుచేస్తూనే రాజమండ్రి ఎంపీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని, 1989లో ఎంపీ గా కాంగ్రెస్ తరపున నెగ్గేసింది. తన అందం , అభినయంతో నటిగా తెలుగు ఆడియన్స్ మదిని దోచిన ఈమె ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను కూడా ఎదిరించి ఇండస్ట్రీలో జమున నిలబడిందని, అందుకే శోభన్ బాబు, కృష్ణ వంటి వారి సరసన నటించి హిట్స్ కొట్టిందని అంటుంటారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి దాదాపు 51 పైగా సినిమాల్లో చేసి, మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి తనను పొగరుబోతుదని, కాలు మీద కాలు వేసుకుంటుందని, సమయానికి రాదంటూ, ఒకవేళ ఆలస్యంగా వచ్చిన క్షమాపణ చెప్పదంటూ కామెంట్స్ చేసేవారట.
ఈమధ్య జమున ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల గురించి ప్రస్తావిస్తూ .. వాళ్లతో ఎక్కువగా మనస్పర్థలు వచ్చాయట. ఎన్టీఆర్ కు అందరు దండాలు పెడుతుంటారు. కానీ తనకు ఇలాంటివి నచ్చవని, ఏ రంగంలోనైనా సొంత వ్యక్తిత్వం, తమ పాత్ర సరిగ్గా ఉంచుకోవాలి లేదా ఇలాంటివి ఎదురవుతాయని తెలిపింది. అందుకే తన వ్యక్తిత్వ విషయంలో వాళ్ల ను బాయ్ కాట్ చేసి, వాళ్ళతో ఇక సినిమాల్లో నటించనని తేల్చి చెప్పింది. కానీ మూడు సంవత్సరాల తర్వాత గుండమ్మ కథ కోసం వారిద్దరితో మళ్లీ నటించేలా విజయ సంస్థ అధినేతలు చక్రపాణి, నాగిరెడ్డి లు ఒప్పించారని జమున అప్పటి విషయాలను ప్రస్తావిస్తూ చెప్పింది.