ఏజ్ కన్నా రేంజ్ ఎక్కువ గల స్టార్ హీరోలు…ఎంత మంది ఉన్నారో…?
Tollywood Heroes :ఏ రంగంలో నైనా కొత్తనీరు రావడం, పాతనీరు పోవడం సహజం. కానీ టాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా స్టార్ హీరోలుగా రాణించడం కొందరి హీరోల విషయంలో జరుగుతూ వస్తోంది. గతంలో ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు కూడా ఏజ్ పెరిగే కొద్దీ తమకు తగ్గ పాత్రలు చేస్తూ రాణించారు. అలాగే ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి,నటసింహం బాలకృష్ణ,కింగ్ నాగార్జున,విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్ళు దూసుకెళ్తున్నారు. ఇక చిరంజీవి 65 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఘరానా మొగుడు – గ్యాంగ్ లీడర్ సమయాల్లో మాదిరిగా ఖైదీనంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్ ని బాస్ లా ఏల్తున్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ నాలుగైదు చిత్రాలతో బిజీ అవ్వడం చూస్తుంటే,వయసు అనేది నంబర్ మాత్రమేనని తేలింది.
నాగార్జున, వెంకటేష్ ల వయస్సు సమానం. 61ఏళ్ళు వచ్చినా ఆ ఇద్దరూ కెరీర్ పరంగా సమాంతరంగానే రాణించారు. ప్రయోగాత్మక సినిమాలతో వెంకీ ఇటీవల అదరగొడుతున్నారు. ఆయన నటించిన నారప్ప మూవీ గురించి భారీ అంచనాలు న్నాయి. గత ఏడాది షష్ఠి పూర్తి ముగించుకున్న నాగ్ లో జోష్ తగ్గలేదు. స్పై యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ తో అభిమానుల్ని థ్రిల్ చేసేందుకు వస్తున్న నాగ్ ఆ తర్వాత బంగార్రాజు అనే పక్కా మాస్ సినిమాలో చేస్తున్నాడు. ఇక 60 వయసులోనూ బాలయ్య మాస్ యాక్షన్ సినిమాలతో అదరగొడుతూ, ఇప్పటికీ నవయువకుడిలా రెట్టించిన ఉత్సాహం తో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటితో హ్యాట్రిక్ హిట్ కోసం కసరత్తు గట్టిగానే చేస్తున్నాడు.
జనసేన పార్టీతో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాల్లో కూడా బిజీగా మారిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 50 ఏళ్ళు వచ్చినా క్రేజు ఏమాత్రం తగ్గలేదు. పవన్ నటించిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని టాక్. మాస్ మహారాజా రవితేజ 52 వయసు లో ఉన్నప్పటికీ లేటు వయసులో హీరో అయ్యాడు. 20ఏళ్ళ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించారు. మాస్ లో ఉన్న ఫాలోయింగ్ తో మాస్ రాజా అని అభిమానులతో పిలిపించుకున్నారు.ఇటీవల క్రాక్ సినిమాతో దుమ్మురేపి,ఖిలాడీ మూవీతో రాబోతున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 46 సంవత్సరాల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే 20ఏళ్ళ పైగా కెరీర్ లో టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నాడు.