టాలీవుడ్ లో ఏ హీరో ఎంత డబ్బును విరాళంగా ఇచ్చారో…?
Tollywood heroes donations :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విడిపోయినప్పుడు గానీ ఏపీలో ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి తమవంతు సాయం చేయటం సహజంగా జరుగుతోంది. ఎన్టీఆర్,అక్కినేని నుంచి కూడా ఇదే సంస్కృతి నడుస్తోంది. దివిసీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్, అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేస్తే, సినిమా పరిశ్రమలో చాలామంది వారితో జతకట్టారు. ఇక వరదలు,తుపాన్లు వచ్చినపుడు సూపర్ స్టార్ కృష్ణ,మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన నటులు,దర్శకులు,వివిధ విభాగాల వాళ్ళు తమవంతు విరాళాలు అందించారు.
అలాగే ఆయా సందర్భాల్లో వెంకటేష్,నాగార్జున వంటివాళ్ళు క్రికెట్ ఆడడం ద్వారా వచ్చిన సొమ్మును సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. అలాగే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు,అల్లు అర్జున్ వంటి వాళ్ళు కూడా ఆయా సందర్భాల్లో విరాళాలు ఇచ్చారు. ఇక గత ఏడాది వర్షాలు,వరదలకు హైదరాబాద్ నగరం నీళ్ళల్లో మునిగిపోయి, చాలామంది ప్రజలు ఇబ్బంది పడినపుడు చాలామంది సినిమా ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు వసూలు చేసి ఇచ్చారు. తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు.
నందమూరి నటసింహం కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించి హైదరాబాద్ నగరంలో నిరాశ్రయులను ఆదుకోడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు కోటి రూపాయల చొప్పున ఇవ్వగా, నాగార్జున 50లక్షలు ఇచ్చారు. యంగ్ హీరోలు రామ్ పోతినేని 25లక్షలు,విజయ్ దేవరకొండ 10లక్షలు,దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్,హరీష్ శంకర్,అనిల్ రావిపూడి 5లక్షల చొప్పున ఇచ్చారు.