MoviesTollywood news in telugu

ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

Directors Sons : హీరోల నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అందరూ విజయాన్ని అందుకోలేరు. హీరోల వారసులే కాదు, కొందరు దర్శకులు కూడా తమ వారసులను హీరోలు చేస్తున్నారు. అయితే టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి. అందుకే బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, సక్సెస్ కాలేకపోయిన వారసులు చాలా మంది ఉన్నారు. ఒకప్పటి విప్లవ సినిమాల దర్శకుడు టి కృష్ణ తనయుడే ఇప్పటి యాక్షన్ హీరో గోపీచంద్. తండ్రి చనిపోయిన తర్వాత తన ప్రయత్నాలు చేసుకుని.. చాలా కష్టపడి మొదటి విలన్ గా మెప్పించి తర్వాత హీరోగా నిలబడ్డాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎందరికో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. అయితే ఆయన తనయుడు ప్రకాశ్ మాత్రం నటుడిగా సక్సెస్ కాలేదు. నీతో సినిమాను ప్రకాష్ తో అప్పట్లో రామోజీరావు నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ నటన జోలికి రాలేదు. ఎవరితో సినిమా తీసినా, తానూ యాక్ట్ చేసినా కూడా ఎన్నో హిట్స్ అందుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు తన వారసుడు అరుణ్ కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఎంతగా ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేకపోయాడు.

ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించి హిట్స్ అందించిన లెజెండరీ దర్శకుడు కోదండరామి రెడ్డి కూడా తన కుమారుడు వైభవ్ ని గొడవ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇప్పించాడు. అయితే అది విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సక్సెస్ అందుకున్నాడు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎమ్మెస్ రాజు తన తనయుడు సుమంత్ అశ్విన్‌ను తూనీగ తూనీగ సినిమాతో పరిచయం చేసారు. మధ్యలో కొన్ని విజయాలు అందుకున్నా..ఇంకా లైన్ లో పడలేదు. లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకు అల్లరి నరేష్ సక్సెస్ అవ్వడానికి చాలా తంటాలు పడ్డాడు. ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తున్నాడు. అలాగే ఈవీవీ పెద్ద కొడుకుగా, అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీకి భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చాడు. హాయ్ నుంచి మొదలుకుని చూస్తే, ఎవడి గోల వాడిది సినిమా తప్ప ఏ మూవీ పెద్ద విజయం సాధించలేదు.

తెలుగులో యముడికి మొగుడు, పెదరాయుడు వంటి ఎన్నో సంచలన సినిమాలు తెరకెక్కించిన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది హీరోగా వచ్చినప్పటికీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. రంగస్థలం లాంటి సినిమాల్లో మంచి నటన కనబరిచాడు. రాజమౌళి కుటుంబం నుంచి కీరవాణి కొడుకుగా వచ్చిన శ్రీసింహా కోడూరి కేరాఫ్ రాజమౌళిగానే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే మత్తు వదలరా, తెల్లవారితే గురువారం సినిమాలు చేసాడు. తాజాగా భాగ్ సాలే చేస్తున్నాడు.

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. అయితే మెహబూబా సినిమాతో రెండేళ్ళ కింద హీరో అయ్యాడు. ఇప్పుడు రొమాంటిక్ సినిమా చేసాడు. కానీ సక్సెస్ రాలేదు. ప్రభాస్‌కు వర్షం లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు శోభన్ వారసుడు సంతోష్ ఏక్ మినీ కథతో హిట్ కొట్టి.. మంచి రోజులు వచ్చాయి మూవీతో వస్తున్నాడు. శోభన్ మరణంతో అతడి బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు.