భోజనం తరువాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు…ఎందుకంటే…
ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. అయితే, అవి మంచివా కావా అన్నది తెలుసుకోగలగాలి. కొంతమంది తెలియకుండా కొన్నిటికి అలవాటు పడతారు. అటువంటివి చెడు చేస్తాయి.ఆహారపు అలవాట్లు అనేది మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు సంబంధించినది. మంచి ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అలాగే చెడువి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చాలా మంది కొన్ని పనులు అలవాటుగా చేసేస్తూ ఉంటారు. అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అన్నది ఆలోచించరు. అందుకే, ఈ రోజు భోజనం తరువాత అలవాటుగా చేసే కొన్ని పనులను, ఆ అలవాట్ల వలన కలిగే నష్టాలను పొందుపరుస్తున్నాము. మీరు చదివేయండి.
చల్లటి నీటిని తాగకండి: జీర్ణక్రియ సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీరు తాగాలని మనలో చాలామందికి తెలుసు. కానీ, భోజనం తరువాత చల్లటి నీరు తాగడం మంచిది కాదు. భోజనం తరువాత చల్లటి నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. భోజనం అయిన 45 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లను తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం వద్దు: భోజనం తరువాత కఠినమైన శారీరిక శ్రమ చేయకూడదు. దీనివల్ల, జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అలాగే జీర్ణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే భోజనం తరువాత కఠినమైన శారీరిక శ్రమ కాకుండా వైద్యున్ని సంప్రదించి ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయవచ్చేమో అడిగి తెలుసుకుని వారి సలహా మేరకు ముందుకు సాగితే మంచిది.
టీ తాగకండి: చాలా మందికి భోజనం తరువాత అలవాటుగా టీ తాగుతారు. అయితే, భోజనంతో శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. వాటిలో ఐరన్ ఒకటి. టీలో ఉండే పాలు శరీరంలో ఐరన్ గ్రహించే శక్తిని తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. మరోపక్క, ఆకుపచ్చ మరియు మూలికల టీలు శరీరంలో గ్యాస్ ఫార్మ్ కాకుండా చేస్తాయని తేలింది.
ధూమపానం హానికరం: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. భోజనం తరువాత పొగత్రాగే అలవాటు మరింత ప్రమాదకరం. భోజనం తరువాత పొగతాగితే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, అల్సరేటివ్ కొలైటిస్ అనే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీలైతే, ధూమపానం చేసే అలవాటునే మానుకోవడం మంచిది.
నిద్రపోకండి: బాగా ఒత్తిడిగా ఉన్నా, మంచి పౌష్టికమైన, రుచికరమైన భోజనం తరువాత నిద్రించాలని చాలామందికి అనిపిస్తుంటుంది. కానీ, భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. గుండెల్లో మంట, గురక, నిద్రలో ఊపిరి అందని సమస్యలు తలెత్తవచ్చు. అందుకే భోజనం తరువాత కొన్ని నిమిషాల వరకు నిద్రపోకుండా ఉంటే మంచిది.
పరిగెత్తకూడదు: భోజనం తరువాత పరిగెత్తకూడదు. భోజనం తరువాత పరుగు తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. భోజనం అయిన నాలుగు – ఐదు గంటల తరువాతే నడక, పరుగు వంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తరువాత పరిగెడితే అది కిడ్నీలపై కూడా ఒత్తిడి పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవకండి: చదవడానికి, డ్రైవ్ చేయడానికి ఎంతో ఏకాగ్రత కావాలి. భోజనం చేసిన తరువాత ఏకాగ్రత అంతగా ఉండదు. భోజనం తరువాత శక్తి అంతా జీర్ణ ప్రక్రియ వైపు మళ్లించబడుతుంటుంది. దాంతో, చదవాలనుకున్న దాని మీద ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది. దాంతో, అర్థం చేసుకునే సామర్ధ్యం కూడా తగ్గుతుంది.