డయాబెటిస్ ఉన్నవారు అవకాడో తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Avocado good for diabetics : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే తప్పనిసరిగా ఆహారం విషయంలో శ్రద్ద పెట్టాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు అవకాడో తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
అవకాడోలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం అనేవి కూడా డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తొందరగా పెరుగుతాయి.
అలా పెరగకుండా అవకాడోలో ఉన్న పోషకాలు సహాయపడతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో నరాల దెబ్బతినడం అనేది ఒక సాధారణ సమస్య. అవకాడోలో ఉండే విటమిన్ B6 మరియు యాంటీఆక్సిడెంట్లు వంటివి నరాలు దెబ్బతినకుండా నిరోధించి, నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం మరియు గ్లాకోమా కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అవకాడోలో కళ్లను రక్షించే లుటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.