గూఢచారి 116 సినిమా గురించి ఈ నిజాలు తెలుసా…అసలు నమ్మలేరు
Krishna Gudachari 116 Movie : ఆంగ్ల సినిమా ప్రేరణతో సూపర్ కృష్ణ హీరోగా సుందర్ లాల్ నహతా, డూండి కల్సి నిర్మించిన గూఢచారి 116 మూవీ అప్పట్లో సూపర్ హిట్. ఎలుక ద్వారా ఓ వైరస్ సృష్టించి ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే శాస్త్రవేత్తను తుదముట్టించి కథతో వచ్చిన ఓ ఎస్ ఎస్ 117 పానిక్ ఇన్ బ్యాంకాక్ మూవీ మద్రాసులో విడుదలైనపుడు చూసిన నిర్మాతలు భారతీయతకు అందునా తెలుగుకి తగ్గట్టుగా మంగళగిరి మల్లికార్జునరావు డైరెక్షన్ లో గూఢచారి 116గా మలిచారు.
విదేశీయులు భారత్ పై చేసే కుట్రను తిప్పికొట్టే అధికారి పాత్రగా గూఢచారి 116 రూపొందించారు. నిజానికి తేనెమనసులుతో పరిచయమైనా కృష్ణ రెండవ మూవీ కన్నె మనసులు చేస్తున్న సమయంలోనే కృష్ణకు గూఢచారి 116 లో ఛాన్స్ వచ్చింది. అప్పటివరకూ ఇలాంటి సాహస సన్నివేశాలతో కూడిన సినిమాలు రాకపోవడంతో కృష్ణ జేమ్స్ బాండ్ మూవీస్ కి బ్రాండ్ ఇమేజ్ గా మారాడు.
కృష్ణతో డూండి 25సినిమాలు తీయడానికి ఈ మూవీ దోహదం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని సమయంలో గూఢచారి 116మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారు. కృష్ణ, మల్లికారుజనరావు కాంబోలో 13మూవీస్ వచ్చాయి. జేమ్స్ బాండ్ మూవీని తెలుగులోకి స్క్రిప్ట్ గా మలచడంలో రచయిత ఆరుద్ర మంచి చాకచక్యం కనబరిచారు.
ఈ మూవీని హిందీలోకి అనువదిస్తే, రచయిత సరిగ్గా ఆరుద్రనే అనుసరించారు. రొమాన్స్, వినోదం, సాహస పోరాటాలు అన్నీ కలగలిసిన ఈ మూవీలో పాత్రల తీరుని మలచిన తీరు అద్భుతం. ఈ మూవీలో మొదట్లో కొంతసేపు కనిపించే ఏజంట్ 303 పాత్రను శోభన్ బాబు వేశారు. కీలక విషయాలు పరిశోధించి అందించే క్రమంలో మరణిస్తాడు.
వీరాభిమన్యులో మంచి పాత్ర ఇచ్చిన నిర్మాతలు ఈ మూవీలో చిన్నపాత్ర ఇవ్వడానికి కారణం శోభన్ బాబు సాంఘికానికి పనికొస్తాడా రాడా అనే సందేహమే. అయితే ఇంత చిన్న పాత్ర ఇచ్చినందుకు శోభన్ బాబు చాలా బాధపడ్డారట. మిమిక్రి కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కూడా ఇందులో నటించడమే కాదు, ఆ పాత్ర కూడా మిమిక్రి కళాకారుని పాత్ర కావడం విశేషం.
విలన్ రాజనాల పొడిపొడి మాటలతో సాగే పాత్ర. రేలంగి కూడా వెరైటీ పాత్ర. 4 గురు భార్యలు, 18మంది సంతానం. అందరి పేర్లు తమాషాగా ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు ఓ సాంగ్ లో కనిపిస్తారు. కృష్ణ, జయలలితతో ‘నువ్వు నాముందుంటే …’ సాంగ్ ని మాత్రం కలర్ లో తీశారు.
కన్నె మనసులు, గూఢచారి 116 ఒకేసారి షూటింగ్స్ వలన అక్కడ స్టిల్స్ ఇక్కడ, ఇక్కడి స్టిల్స్ అక్కడ ప్రదర్శించడంతో కృష్ణను డైరెక్టర్స్ మందలించారట. ఓ ఇంటర్యూలో కృష్ణ ఈ విషయం వెల్లడిస్తూ సినిమాకు కొత్త కావడంతో అలా ఇబ్బంది వచ్చిందన్నారు.