ఎన్టీఆర్ తొలిసినిమా మనదేశం గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Mana Desam Full Movie :మన సినిమాలో వేషం ఇవ్వడానికి ఓ వ్యక్తిని పిలిచామని, విజయవాడ నుంచి వస్తున్న అతడిని తీసుకురావాలని దర్శకులు ఎల్వి ప్రసాద్ ఆదేశం మేరకు అప్పటిలో ప్రొడక్షన్ పనులు చూసే ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె రాఘవ చెన్నె రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. ఫోటో కూడా తీసుకుని స్టేషన్ లో వెయిట్ చేస్తుంటే,ఓ అందమైన యువకుడు కన్పించాడు.
బయటకు వచ్చాక ఇక్కడ సిటీ బస్సు ఎక్కితే శోభనాచల స్టూడియో దగ్గర దిగొచ్చు అని రాఘవ చెప్పారు. బస్సు ఎందుకు నడుస్తూ వెళదాం అని ఎన్టీఆర్ అన్నారు. బ్రిడ్జి మీది నుంచి స్టూడియో దాకా నడిచి వెళ్లారు. రాఘవ అలసిపోయినట్లు కన్పించినా,ఎన్టీఆర్ లో హుషారు తగ్గలేదు. మనదేశం సినిమాలో ఎన్టీఆర్ ది ఇనస్పెక్టర్ వేషం. కానిస్టేబుల్ నుంచి ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పే డైలాగ్ అది. సరిగ్గా ఎన్టీఆర్ జీవితంలో అది సరిపోయింది.
మాములుగా ఎంట్రీ ఇచ్చి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా మారిన ఎన్టీఆర్ అసలు సినిమా రంగంలో ఎలా అడుగుపెట్టారో తెలుసుకుంటే స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక విజయవాడలోని విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఇంటర్ లో చేరారు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ప్రోత్సాహంతో రాచమల్లు నాటకంలో ఎన్టీఆర్ నాగమ్మ వేషం వేశారు. ఇంటర్ ఫెయిలయ్యాక బసవతారకంతో ఎన్టీఆర్ పెళ్లి 1942ఏప్రియల్ 22న ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత మళ్ళీ ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్థిరస్తాదార్ గా 64రూపాయల జీతంతో తాత్కాలిక ఉద్యోగం పొందారు. మధ్యలో రెండు వ్యాపారాలు చేసినా కల్సి రాలేదు.
మొత్తానికి ఇంటర్ పాసవ్వడంతో గుంటూరు ఏసీ కాలేజీలో బిఎ లో చేరారు.అక్కడ మల్లమ్మ దేవి నాటకంలో తాండ్రపాపారాయుడు పాత్రకు ఎన్టీఆర్ బహుమతి అందుకున్నారు. నవజ్యోతి నాటక సమాజం పెట్టారు. ఇక కీలుగుఱ్ఱం సినిమాలో హీరోగా తీసుకోవాలని సి పుల్లయ్య భావించగా, బిఎ పూర్తిచేయాలన్న ఉద్దేశ్యంతో సినిమా అఫర్ వదిలేసారు. విజవాడ దుర్గా కళామందిర్ లో వారం పాటు సాగిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో చేసిన పాపం నాటకంలో ఎన్టీఆర్, జగ్గయ్య కల్సి నటించారు.
పృథ్విరాజ్ కపూర్,శాంతారాం,బిఎన్ రెడ్డి, హెచ్ ఎం రెడ్డి,ఎల్వి ప్రసాద్ జడ్జీలుగా వచ్చారు. ఆ నాటకానికి మొదటి బహుమతి రాగా, సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని శాంతారాం చెప్పగా, తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఎల్వి ప్రసాద్ తాతినేని రామారావు ద్వారా చెప్పించారు. తెనాలిలో స్టైల్ ఫోటోగ్రాఫ్స్ తీసాక మద్రాసులో స్టిల్స్ తీసి, ఇపుడు సినిమా లేదు. తర్వాత కబురు చేస్తాం అని ఎల్వి ప్రసాద్ అనడం, ఫ్రెండ్స్ అందరూ సినిమా వద్దని చెప్పడంతో గుంటూరు జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలో చేరారు.
తర్వాత ఎల్వి ప్రసాద్ నుంచి లెటర్ రావడంతో మద్రాస్ వెళ్లిన ఎన్టీఆర్ ని పల్లెటూరి పిల్ల మూవీలో డైరెక్టర్ బిఎ సుబ్బారావు హీరోగా బుక్ చేసి వెయ్యి నూట పదహార్లు చేతిలో పెట్టి ఉద్యోగం రాజీనామా చేసి రమ్మన్నారు. అయితే ఒకేసారి పెద్ద పాత్ర ఇస్తే ఇబ్బంది అందుకే మనదేశం సినిమాలో చిన్న వేషం ఇస్తానని ఎల్వి ప్రసాద్ చెప్పారు. ఒకే చెప్పిన ఎన్టీఆర్ ఉద్యోగం రాజీనామా చేసి, మనదేశం షూటింగ్ లో చేరారు. 250రూపాయలను నిర్మాత కృష్ణవేణి అడ్వాన్స్ ఇచ్చారు.
వరూధిని సినిమాతో ఇంటికి వెళ్ళిపోయిన ఎస్వీ రంగారావు ని పిలిచి చిన్న వేషం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఘంటసాలను ఎంచుకున్నారు. ఈమూవీతో జిక్కీ గాయనిగా ,లీల గాయనిగా ఎంట్రీ ఇచ్చారు. బ్రిటిష్ కాలంలో మనవాళ్ళ అగచాట్లు, అప్పటి పోలీసుల జులుం నేపధ్యంగా ఈ కథ అల్లారు. అయితే లాఠీచార్జి విషయంలో ఎన్టీఆర్ నిజంగా రెచ్చిపోయి చాలామంది ఒళ్ళు చీరేసారు. దీంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ ని ఎల్వి ప్రసాద్ మందలించారు. అయితే బిఎ సుబ్బారావు కి ఎన్టీఆర్ అంకిత భావం నచ్చేసింది.