Bhogi రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి..?
Bhogi pandlu :భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయటం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.