ఏ వయస్సు వారు ఎంతసేపు నిద్ర పోవాలో తెలుసా ?
Healthy Sleep Habits :ఆహారం, నీరు, ఆక్సిజన్ తరువాత మనిషికి అత్యంత అవసరమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. నిద్ర వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. శరీరం కణజాలాలను మరమ్మత్తులు చేసేందుకు, కొత్త కణజాలం పెరిగేందుకు, శరీరం ఎదుగుదలకు, జీవక్రియల క్రమబద్దీకరణకు, శక్తికి, ఉత్తేజానికి నిద్ర చాలా అవసరం.
నిద్ర లేకపోతే అనేక రకాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. అయితే వయస్సుకు తగ్గట్టుగా మనం రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో కింద చదివి తెలుసుకోండి..! అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెలల వయస్సు చిన్నారుల వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. 4 నెలల నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటల నిద్ర పోవాలి. 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల లోపు పిల్లలకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర కావాలి. 6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు నిద్రపోవడం వాళ్ల ఆరోగ్యానికి మంచిది. 14 నుంచి 17 ఏళ్ల లోపు వారు 8 నంచి 10 గంటలు నిద్ర పోవాలి.
18 నుంచి 25 ఏళ్ల వయస్సు వారు 7 నుంచి 9 గంటల నిద్ర పోతే సరిపోతుంది. 26 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
అదే 65 ఏళ్లు పైబడిన వారు రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర పోతే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.