కాలర్ పట్టుకున్నాడని నాగార్జున దుమ్ముదులిపిన కృష్ణ ఫ్యాన్స్…. ఎప్పుడు జరిగిందో తెలుసా?
Nagarjuna and krishna Movie: ఎంత పెద్ద హీరో అయినా ఫాన్స్ ముందు తలవంచాల్సిందే. వారికి ఇష్టం లేని మూవీస్,సంఘటనలు కొంపముంచేస్తాయి. ఎన్టీఆర్ , అక్కినేని శకం తర్వాత ఇలాంటి పోకడలు చాలానే వస్తున్నాయ్. ఫాన్స్ మధ్య ఘర్షణ వాతావరణం ఎందుకని హీరోలే వెనక్కి తగ్గే పరిస్థితులు చాలా ఘటనల్లో ఎదురవుతున్నాయి.
తెలుగు చిత్రసీమలో రెండు కళ్లుగా భావించే ఎన్టీఆర్ , అక్కినేని ల తర్వాత హీరో కృష్ణ తన డాషింగ్ అండ్ డేరింగ్ తో తన ఆధిపత్యాన్ని చాటాడు. జేమ్స్ బ్యాండ్ మూవీస్, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రిక సినిమా,సింహాసనం లాంటి 70ఎం ఎం మూవీ ఇలా ఎన్నో సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ కొనసాగించాడు. తమ హీరోపై ఈగ వాలితే ఫాన్స్ అస్సలు ఊరుకొని రోజులవి. హీరో కేరక్టర్ చనిపోయినట్లు చూపించినా సరే తట్టుకోలేక ఫాన్స్ సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఫాన్స్ తో పెట్టుకుంటే కుదరదని ముచ్చెమటలు పట్టించిన ఓ సంఘటన లోకి వెళదాం.
అప్పట్లో హీరోల కేరక్టర్లను మలచడానికి దర్శక నిర్మాతలు నానాయాతన పడాల్సి వచ్చేది. 1993లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో హీరో నాగార్జున తండ్రి పాత్రలో కృష్ణ నటించాడు. ఈ సినిమాలో ఓ సంఘటనతో నాగార్జునకి చేదు అనుభవం ఫాన్స్ నుంచి ఎదురైంది. ఆ సినిమాలో కృష్ణ ఓ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించగా, అతడి కొడుకు నాగ్ కి తండ్రితో ఏమాత్రం పొసగదు.
తండ్రిని చూస్తే ఏదో చేసెయ్యాలన్న కసితో ఉంటాడు నాగ్. ఎందుకంటే తల్లి మరణానికి తండ్రి కారణమని భావించడం. అందుకే తండ్రిపై ద్వేషం పెంచుకుని,పోలీసులకు లొంగిపోవాలని పదేపదే హెచ్చరిక చేస్తాడు. అయితే తాను అన్యాయంపై పోరాటం చేస్తున్నానని కృష్ణ సర్దిచెప్పినా నాగ్ వినేవాడు కాదు. సరిగ్గా ఇదే సమయంలో ప్రత్యర్థులనుంచి ముప్పుందన్న అనుమానంతో మనవడిని కృష్ణ కిడ్నాప్ చేయించి, సేఫ్ జోన్ లో ఉంచుతాడు.
ఇక కొడుకు కనిపించడం లేదని తెలిసిన నాగ్ మెరుపు వేగంతో కృష్ణ దగ్గరకు వచ్చి తనకొడుకుని అప్పగించాలని,లేకపోతె అంతుచూస్తానని హెచ్చరిస్తూ,కృష్ణ కాలర్ పట్టుకుంటాడు. సినిమాలో ఆ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. అయితే ఇది కృష్ణ ఫాన్స్ కి అస్సలు నచ్చలేదు. పైగా తమ హీరోని తండ్రి పాత్రలో చూడడమే జీర్ణించుకోలేకుండా ఉన్న ఫాన్స్ కి ఎక్కడో కాలింది. ఓ జూనియర్ హీరో తమ హీరో కాలర్ పట్టుకోవడం ఏమిటంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
అసలు ఆ సీన్ తీసేయాలని పట్టుబట్టారు. లేకుంటే రిలీజ్ అడ్డుకుంటామని ప్రకటించారు. చివరకు కృష్ణ రంగంలో దిగి ఫాన్స్ కి సర్దిచెప్పాల్సి వచ్చింది. అయినప్పటికి కొన్ని చోట్ల బాక్స్ లు కూడా ఎత్తుకుపోవడంతో నిర్మాత మురళీమోహన్ తక్షణమే కాలర్ పట్టుకున్న సీన్ తొలగించి,మరికొన్ని అభ్యంతరకర డైలాగులను కూడా తీయించేసారు. అప్పటికి కానీ కృష్ణ ఫాన్స్ కి ఆవేశం చల్లారలేదు. ఇదే విషయాన్నీ వారసుడు ఫంక్షన్ లో నాగార్జున చెబుతూ కృష్ణ ఫాన్స్ దెబ్బకి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాల్సి వచ్చిందన్నారు.