టాలీవుడ్ టాప్ హీరోయిన్స్…ఏమి చదివారో తెలుసా…?
Tollywood Heroines Education:సినీ ప్రపంచంలో చదువుకు పెద్ద ప్రాధాన్యం ఉండదు. అందం, అభినయం, అదృష్టం ఉంటే తిరుగులేకుండా రాణించొచ్చు. అలాగని మన తారలు చదువు నిర్లక్ష్యం చేయలేదండి. ముఖ్యంగా ఇప్పుడు నటనలో ముందున్న దక్షిణాదికి చెందిన కథానాయికలు ఒకప్పుడు చదువులోనూ ముందున్నారు. నయనతార, సమంత నుంచి రకుల్ వరకూ అందరూ ఉన్నత విద్యలు అభ్యసించిన వారే.
నయనతార- లేడీ సూపర్‌స్టార్
అభిమానులు ప్రేమతో ‘లేడీ సూపర్‌స్టార్’ అని పిలిచే నయనతార వివిధ కళాశాలల్లో చదివారు. ఎక్కువగా ఉత్తరాదిలో ఆమె విద్యాభ్యాసం జరిగింది. సినీ కెరీర్ ప్రారంభించక ముందు ఆమె మార్థోమా కళాశాలలో బీఏ పూర్తి చేశారు. 2003లో ఓ మలయాళ చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. తెలుగులో ఆమె మొదటి సినిమా వెంకటేశ్ నటించిన ‘లక్ష్మీ’.
అనుష్క-స్వీట్ స్వీటీ
ఎనలేని ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న కథానాయిక అనుష్క. ‘జేజమ్మ’ పాత్రతో తన నటనా సామర్థ్యాన్ని చాటి చెప్పిన స్వీటీ.. ‘దేవసేన’ పాత్రతో అది అంతర్జాతీయ స్థాయికి చేరింది. స్వీటీ కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆమె యోగా శిక్షకురాలు కూడా. యోగా గురువు భారత్ ఠాకూర్ దగ్గర ఆమె శిక్షణ తీసుకున్నారు. తర్వాత అనుకోకుండా 2005లో నాగార్జున-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూపర్’ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. తర్వాత అనేక చిత్రాలతో స్వీటీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
సమంత-జెస్సీ
సామ్ హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివారు. మోడలింగ్ కన్నా ముందు చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్ పూర్తి చేశారు. 2010లో నాగచైతన్య సరసన ‘ఏ మాయ చేసావె’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. నేడు వరుస విజయాలతో అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు.
తమన్నా-మిల్కీ బ్యూటీ
తమన్నా ముంబయిలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో చదివారు. ఆర్ట్స్‌లో పట్టా పొందారు. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ చిత్రంతో 2005లో నటిగా పరిచయం అయ్యారు. తెలుగులో ఆమె తొలి సినిమా ‘శ్రీ’. ఇందులో మంచు మనోజ్ కథానాయకుడు.
త్రిష-పౌర్ణమి
త్రిష చెన్నైలోని చర్చ్ పార్క్ వద్ద ఉన్న సేక్రేడ్ హార్ట్ మెట్రిక్యులేషన్‌లో పాఠశాల పూర్తి చేశారు. చెన్నైలోని మహిళా కళాశాలలో బీబీఏ చదివారు. 1999లో వచ్చిన ‘జోడీ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన త్రిష.. ‘ఆరు’ సినిమాతో 2002లో నటిగా గుర్తింపు పొందారు.
కాజల్-చందమామ
కాజల్ కేవలం అద్భుతమైన నటే కాదు.. విద్యార్థిని కూడా. ఆమె జై హింద్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తర్వాత కేసీ కళాశాలలో మాస్ మీడియాలో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందారు. 2004లో ‘క్యూ హో గయా నా..’ అనే హిందీ సినిమాలో ఐశ్వర్యరాయ్ సోదరి పాత్రలో నటించారు. 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
శ్రుతి హాసన్- కమల్ హాసన్ బేటీ
కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలోని లేడీ ఆండాల్ వెంకట సుబ్బారావు స్కూల్‌లో విద్యను అభ్యసించారు. తర్వాత ముంబయిలోని కాలేజీలో సైకాలజీ చదివారు. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆమెలో నటే కాదు మంచి గాయని కూడా ఉన్నారు.
రకుల్
దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ గుర్తింపు రావాలని శ్రమిస్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఆమె దిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. జీసస్ అండ్ మేరీ కాలేజీ, దిల్లీ యూనివర్శిటీలో గణితం అభ్యసించారు. 2009లో ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. తెలుగులో ఆమె తొలి సినిమా ‘కెరటం’.