Varalakshmi Vratham:వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 25న చేయటం కుదరలేదా..అయితే ఎప్పుడు చేసుకోవాలి
Varalakshmi Vratham 2023: సాధారణంగా అందరు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే అష్టైశ్వర్యాలు,సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. పెళ్లి కానీ అమ్మాయిలు మంచి భర్త కోసం పెళ్ళైన మహిళలు తమ సౌభాగ్యం,కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలా స్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని పూజకు సిద్ధం చేసుకొని వ్రతం చేసుకున్నాక ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితిగా వస్తుంది. కొన్ని కారణాల వలన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరకపోతే బాధపడవలసిన అవసరం లేదు.
మరల శ్రావణ మాసం వచ్చేవరకు కూడా ఆగవలసిన అవసరం కూడా లేదు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయటం కుదరకపోతే ఆశ్వయుజమాసంలో చేసుకుంటే శుభమని అష్టైశ్వర్యాలు,సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.
ఈ ఆశ్వయుజమాసంలో చేసుకున్న శ్రావణ మాసంలో చేసుకున్నప్పుడు కలిగే ఫలితాలు అన్నింటిని పొందవచ్చని పండితులు చెప్పుతున్నారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆశ్వయుజమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పూట సాయంత్రం ప్రదోషం సమయం ముగిసిన తర్వాత చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.
శ్రావణ మాసంలో చేసిన విధంగానే ఆశ్వయుజమాసంలో కూడా శుక్రవారం తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానము చేసి పట్టు వస్త్రాలను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి. కలశం పెట్టుకొని అష్ణోత్తరశత నామాలతో అర్చించి అనేక విధాలైన భక్ష్యాలను, పిండివంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేయబడిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకుని భక్తిగా ప్రదక్షిణ, నమస్కారాలు సమర్పించాలి.ఇంటికొచ్చిన ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంగారు ఆభరణాలకు లోటుండదు. సమస్త సంపదలు తులతూగుతాయి.కావున శ్రావణం లో చేయలేకపోతున్నామని బాదపడకుండా ఆశ్వయుజంలో వ్రతం చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షం పొందండి.