Uday kiran Movies:ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయో తెలుసా ?
Uday kiran Movies :ఉదయ్ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకొని ముందుకు సాగినా…కొన్ని కారణాలతో ఉదయ్ కిరణ్ ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. మిలీనియం మొదట్లో ఉదయ్ కిరణ్ అంటే సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడు.. నిర్మాతల బంగారు బాతు. నిజానికి నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే డైలాగ్ కి అనుగణంగా ఉదయ్ కిరణ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు.
చిత్రం మూవీతో ఇండస్ట్రీకి వచ్చి, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే సూపర్ స్టార్ అయిపోయాడు. కానీ అంతే త్వరగా పడిపోయాడు. ఒకటి రెండు కాదు.. ఉదయ్ చేతుల్లోంచి చాలా సినిమాలు పోయాయి. అప్పట్లో సంచలన సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం.. ఖుషీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సూర్య మూవీస్ బ్యానర్‌పై ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే సినిమా మొదలు పెట్టాడు.
80 శాతం పూర్తయ్యాక అనివార్య కారణాలతో ఆగిపోయింది. అలాగే ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. పూజ కూడా జరిగిన తర్వాత ఈ చిత్రం రద్దయింది. చిరంజీవి కూతురు సుష్మితతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగిన తర్వాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేసినా ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఆగిపోయింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో భారీ క్యాస్టింగ్‌తో నర్తనశాల సినిమా లాంఛనంగా మొదలుపెట్టాడు. అభిమన్యుడి పాత్ర కోసం ఉదయ్ కిరణ్‌ను తీసుకున్నాడు. అయితే ప్రధాన పాత్రధారి అయిన సౌందర్య హఠాన్మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. హిందీలో సూపర్ హిట్ అయిన జబ్ వి మెట్ సినిమాను ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్‌లో తెలుగులో రీమేక్ చెయ్యాలనుకున్నా కూడా ఆగిపోయింది.
తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ కూడా ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమా ప్లాన్ చేసి తర్వాత ఆపేసారు. భారీ సినిమా ఆది శంకరాచార్య సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం కూడా అనుకోకుండా ఆగిపోయింది. అప్పటికే ఉదయ్ మార్కెట్ పడిపోవడంతో నిర్మాత కూడా ఆర్థిక సమస్యలతో ఈ సినిమా ఆపేసాడు.
ఉదయ్ కిరణ్‌తో అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహం లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ తర్వాత కూడా ఓ సినిమా చేయాలనుకున్నా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. తెలుగులో విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా అప్పట్లో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా, ఎందుకో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఆపేసాడు.
ఇక ఉదయ్ కిరణ్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ.. ఆయన కష్టాల్లో ఉన్నపుడు ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఉదయ్ కెరీర్ డైలమాలో ఉన్న సమయంలో ఔనన్నా కాదన్నా సినిమా చేసాడు. మరోసారి సినిమా చేయాలనుకున్నా కూడా కుదర్లేదు. ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయో ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న.