Annavaram Prasadam:అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఆలయ ప్రసాదంలా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు!
Annavaram Prasadam:సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే అందరికీ చాలా ఇష్టం. అన్నవరం వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తింటే ఆ రుచికి మనం మైమర్చిపోతాము. అలాంటి ప్రసాదం మన ఇంటిలోనే తయారు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు
1 కప్పు ఎర్ర గోధుమ నూక
1 కప్పు పంచదార
1 కప్పు తురిమిన బెల్లం
1/3 కప్పు నెయ్యి
జాజికాయ
1/4 టీస్పూన్ పటిక
4-5 ఏలకులు
2 చిటికెడు కుంకుమపువ్వు
3 నీరు
తయారి విధానం
ముందుగా జాజికాయ, పటిక యాలకులు, కుంకుమపువ్వు మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద మందపాటి అడుగు ఉన్న పాన్ పెట్టి ఎర్ర గోధుమనూకను వేసి తక్కువ మంటపై రోస్ట్ చేసి పక్కన పెట్టాలి.
ఆ తర్వాత అదే పాన్ లో మూడు కప్పుల నీరు వేసి మరిగించాలి. ఆ మరిగిన నీటిలో వేగించి పెట్టుకున్న ఎర్ర గోధుమ నూకను వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మెత్తగా ఉడికించాలి.
ఆ తర్వాత పంచదార వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత తురిమిన బెల్లం వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగి పైకి బుడగలు వచ్చేవరకు ఉంచాలి.
మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు అలాగే ఉంచాలి. ఇక ఇప్పుడు పైన పొడిగా తయారు చేసుకున్న సుగంధద్రవ్యాలు వేసి బాగా కలపాలి. చిక్కగా అయ్యేవరకు ఉంచి ఆ తర్వాత పోయి ఆఫ్ చేయాలి. ఈ ప్రసాదం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారాక తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది.