Kitchenvantalu

Bendakaya Pachadi : పులుసు వేపుడు బోర్ కొడితే ఒకసారి పచ్చడి ట్రై చేయండి.. వేడి వేడి అన్నంతో బాగుంటుంది

Bendakaya Pachadi Recipe : బెండకాయ జిగురుగా ఉంటుందని మనలో చాలామంది తినటానికి ఇష్టపడరు. అయితే బెండకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయతో ఎప్పుడు చేసుకునే పులుసు, వేపుడు కాకుండా పచ్చడి చేసుకుంటే నోటికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు
బెండకాయలు పావుకిలో, మెంతులు పావు స్పూను, ధనియాలు రెండు స్పూన్లు, ఎండుమిర్చి 15, జీలకర్ర అర స్పూను, టమాటాలు (రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి), వెల్లుల్లి రెబ్బలు నాలుగు, చింతపండు చిన్న నిమ్మకాయ అంత, ఆవాలు ఒక స్పూను, పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూను, కరివేపాకు రెండు రెమ్మలు, నూనె సరిపడా

తయారీ విధానం
పొయ్యి మీద మూకుడు పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయ్యాక పావు స్పూను మెంతులు, అర స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్లు ధనియాలు వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత 15 ఎండు మిరపకాయలను కట్ చేసి వేసి వేగించాలి. ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే మూకుడులో రెండు స్పూన్ల నూనె వేసి బెండకాయ ముక్కలను వేసి వేగించాలి.

బెండకాయ ముక్కలు కొంచెం వేగాక మరొక స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు వేసి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెండకాయ, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ముందుగా వేగించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాల మిశ్రమం వేసి ఒకసారి మిక్సీ చేయాలి.

ఆ తర్వాత సరిపడా ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేగించి పెట్టుకున్న బెండకాయ, టమాటా ముక్కలు వేసి కొంచెం బరకగా ఉండేలా మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇక తాలింపు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి వేగించాలి.

ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి అన్ని వేగిన తర్వాత ఈ తాలింపును తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం లేదా చ‌పాతీలు లేదా ఏదైనా టిఫిన్‌లోనూ తిన‌వ‌చ్చు.
Click Here To Follow Chaipakodi On Google News