Boondi Laddu:బూందీ లడ్డు స్వీట్ షాప్ లోలా రావాలంటే ఇలా చేయండి
Boondi Laddu:బూందీ లడ్డు స్వీట్ షాప్ లోలా రావాలంటే ఇలా చేయండి…వంట రాని వారు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్దాలు
శనగపి౦డి – అర కిలో
ప౦చదార – కిలో
నూనె – కిలో ( నేతి మిఠాయి కావాలనుకు౦టే ఒక కిలో నెయ్యి వాడాలి.)
జీడిపప్పు – 100 గ్రాములు
కిస్మిమిస్ – 50 గ్రాములు
యాలకులు – 10 గ్రాములు
కు౦కుమపువ్వు- చిటికెడు
నెయ్యి – అర కప్పు
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో శనగపిండి తీసుకోని దానిలో నీరు పోసి గరిట జారుగా ఉండలు లేకుండా బాగా కలపాలి.
ఒక గిన్నెలో పంచదార,ఒక లీటర్ నీరు పోసి స్టౌవ్ మీద పెట్టి తీగపాకం వచ్చేవరకు కలపాలి. తీగపాకం అంటే పాకాన్ని రెండు వేళ్ళతో పట్టుకొని లాగి చూస్తే తీగ రావాలి. అరకప్పు పాలలో కు౦కుమ పువ్వు వేసి కలిపి ఈ పాకంలో వేసి దించాలి.
ఒక బాండి పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు,కిస్ మిస్ లు వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే బాండిలో నూనె పోసి కాగాక పైన తయారుచేసుకున్న శనగపిండిని కప్పుతో తీసుకోని సన్నని ర౦ధ్రాలు కలిగి లోతుగా వున్న చట్ర౦లో పొయ్యాలి.అదే కప్పుతో చట్ర౦లో పి౦డిని తిప్పితే పి౦డి సన్నగా నూనెలోకి రాలుతు౦ది.
బూ౦దీని వేగించినప్పుడు మరీ ఎరుపు రంగు రాకుండా పసుపు ర౦గులో వున్నప్పుడే తీసేయాలి. ఈ విధంగా బూ౦దీ మొత్తం దూయాలి. ఇప్పుడు బూ౦దీ,కిస్ మిస్,జీడిపప్పు,యాలకులపొడి అన్నీ కలిపి పాకంలో వేసి బాగా కలిపి కొద్దిగా చల్లారక మనకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి.