Ugadi Pachadi:ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు… తినకపోతే ఎంత నష్టమో చూడండి
Ugadi Pachadi For Health Benefits:ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు… తినకపోతే ఎంత నష్టమో చూడండి.. ఉగాదినాడు పంచాంగ శ్రవణంతోపాటు పచ్చడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యమైంది ఉగాది పచ్చడి.
ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిందే ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఉగాది పచ్చడి తయారుచేయడానికి మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం వాడతారు. ఉగాది పచ్చడిలో ఉపయోగించే ఒక్కో రుచికి ఒక్కో అర్ధం ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కాలం మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఏ రుచికి ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
వేప (చేదు)
వేపలో రోగనిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. రుతువుల్లో వచ్చే మార్పుల కారణంగా పిల్లలకు సోకే ఆటలమ్మ, కలరా, మలేరియాకు నిరోధకంగా పనిచేస్తుంది. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది . వేపకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
బెల్లం (తీపి)
బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదంలో చాలా మందులకు బెల్లంను ఉపయోగిస్తారు. బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలు బెల్లం తింటే రక్తప్రసరణ బాగా జరిగి శరీరానికి అవసరమైన ఇనుము అందుతుంది. గర్భధారణ సమయంలో కామన్ గా ఉండే రక్తహీనత సమస్య నుంచి బయట పడతారు. అజీర్తి, పొడి దగ్గులాంటివి దూరం చేస్తుంది.
మామిడికాయ (వగరు)
మామిడి కాయలో పులుపు, తీపితోపాటు వగరు గుణం కూడా ఉంది. చర్మం నిగారింపు మెరుగుదలకు సహాయపడుతుంది. విపరీతమైన చలి తర్వాత వేడి వల్ల పెదాలు పగులడాన్ని మామిడిలోని వగరు గుణం నివారిస్తుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించి, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
చింతపండు (పులుపు)
మామిడి ముక్కలు, చింతపండు పులుపు కలిసి మన ఆలోచనా శక్తి పరిధిని మరింతగా పెంచి సన్మార్గంలో నడిపిస్తాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చింతపండులోని పులుపు వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. చింతపండు మనలో చింతను దూరం చేసి మానసిక అనార్యోగ బారిన పడకుండా కాపాడుతుంది.
పచ్చిమిర్చి (కారం)
పచ్చిమిర్చిలోని కారం గుణం తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులను నివారిస్తుంది. అజీర్తి సమస్యలు మాయమవుతాయి. ముఖంపై మొటిమలు తగ్గించేందుకు యాంటీ బయటిక్ గా పనిచేయటమే కాకుండా అధిక వేడికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఆలోచనాశక్తిని కూడా పెంచుతుంది.
ఉప్పు
ఉప్పు మానసిక, శారీరక రుగ్మతలను తగ్గించడానికి సహాయపడుతుంది . ఉప్పు మేథోశక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థా, మెదడు పనితీరూ బాగుండలన్నా.. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలన్నా… ఉప్పు తప్పనిసరి. బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగుతాయి. జీర్ణాశయం,శరీరం శుభ్రమవుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. వేసవి వాతావరణానికి తగ్గట్టు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
ఉగాది పచ్చడిని ఖాళీ కడుపుతో తింటే మంచి ప్రభావాన్ని చూపుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్ ఉగాది రోజు మనం తయారుచేసుకొని ఆరు రుచుల ఉగాది పచ్చడిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఉగాది రోజు తప్పనిసరిగా ఒక గ్లాస్ ఉగాది పచ్చడి త్రాగి ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.