Blood Circulation:మీ శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేదని తెలిపే 9 లక్షణాలు ఇవే..!
Blood Circulation:మన శరీరంలో ఉండే జీవధార.. రక్తం.. మన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు దాదాపుగా 7 శాతం వరకు ఉంటుంది. ప్రతి వ్యక్తిలో దాదాపుగా 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అయితే ఆడ, మగ, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితి వంటి అనేక అంశాల వల్ల రక్తం పరిమాణం మారుతుంది. ఇక మన శరీరంలో అనేక ముఖ్యమైన పనులు సజావుగా జరిగేందుకు రక్తం అవసరం.
శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేర వేసేందుకు రక్తం పనికొస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూడడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్కోసారి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
1. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కిడ్నీలపై ఆ ప్రభావం పడుతుంది. దీంతో పాదాలు, చేతుల్లో నీరు చేరుతుంది. దీన్ని ఎడిమా అని పిలుస్తారు. ఈ క్రమంలో పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి.
2. మన శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. శరీరం మాటి మాటికీ చల్లబడుతుంటుంది. చలిగా అనిపిస్తుంది.
చిన్న చిన్న పనులకే బాగా అలసిపోతుంటే శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని గుర్తించాలి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తుంటాయి.
3. రక్త సరఫరా సరిగ్గా లేకపోతే పురుషుల్లో అంగ స్తంభనలు ఉండవు. శృంగారంపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
4. జీర్ణ సమస్యలు బాగా ఉన్నవారిలోనూ రక్త సరఫరా తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం సమస్య కూడా వస్తుంది.
5.రక్త సరఫరా సరిగ్గా లేకపోతే మతిమరుపు వస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత ఉండదు.
6.రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే జీవక్రియల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
7.ఆకలి లేకపోయినా, చర్మం రంగులో మార్పులు కనిపిస్తున్నా.. రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి.
8.రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే గోళ్లు, వెంట్రుకలు బలహీనంగా మారిపోతాయి. వాటి పెరుగుదల ఆగిపోతుంది.
9.కాళ్లలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు వాపులకు గురై బయటకు కనిపించడం.. తదితర లక్షణాలు కనిపిస్తున్నా శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేదని తెలుసుకోవాలి. తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.