Sravana masam 2024: శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం? ఈ మాసంలో వచ్చే పండుగలు..
Sravana masam 2024: మరి కొన్ని రోజుల్లో ఆషాడమాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. చంద్రుడు శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణమాసంగా పరిగణిస్తారు. హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణమాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదోది.
ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమవుతుంది. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. పార్వతి దేవికి ఉన్న మరొక పేరే మంగళ గౌరీ. కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు.
శ్రావణమాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు.
మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ దేవి వ్రతంతో పాటు నాగ పంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణమాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది.