spicy food:కారం తిన్నాక..నోరు మండితే..పంచదార తింటున్నారా.. అయితే..
spicy food:జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ భిన్నమైన రుచులను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రధానంగా జనాలు ఎక్కువగా ఇష్టపడే రుచుల్లో చెప్పుకోదగినవి రెండు అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి.
అయితే తీపి సంగతి పక్కన పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంతగా మంటను ఫీల్ అవ్వరు. ఇక తినక తినక ఒక్కసారి కారం తింటే అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
నాలుకంతా మంటగా మారడంతో మిరపకాయ తిన్న కాకిలా మారిపోతారు. నోరంతా ఊ… అని ఉసికొడుతుంటారు. అలాంటి వారు వెంటనే వెళ్లి గుప్పెడంత చక్కెరను నోట్లో వేసుకుంటారు. అయితే కారంతో నోరు మంటగా ఉన్నప్పుడు చక్కెర ను తినడం అంత శ్రేయస్కరం కాదు..చక్కెరకు బదులుగా ఈ పదార్థాలు తింటే కారంమంట తగ్గడమే కాకుండా….ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పాలు
బాగా కారంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల నోరంతా మంటగా మారితే వెంటనే ఒక గ్లాస్ పాలు తాగేయండి. దీంతో మంట తగ్గుతుంది. పాలల్లో ఉండే కేసీన్ నాలుకపై ఏర్పడే మంటను తగ్గిస్తుంది.
పిండి పదార్థాలు
బ్రెడ్, అన్నం, ఉడికిన ఆలుగడ్డలు వంటి పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీని వల్ల నాలుక మంట తగ్గుతుంది.
నిమ్మకాయ
ఒక నిమ్మకాయను తీసి అడ్డంగా కోసి ఆ ముక్కను నోట్లో పిండుకోవాలి. దాన్నుంచి వచ్చే రసం నాలుక మంటను తగ్గిస్తుంది.
తేనె
ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని కొంత సేపు అలాగే ఉంచి అనంతరం ఆ తేనెను మింగేయాలి. దీంతో నాలుక, నోట్లో ఉన్న కారం మంట తగ్గుతుంది.
చక్కెర
వేరే వస్తువులు ఏవీ అందుబాటులో లేనప్పుడు…తప్పని పరిస్థితుల్లో చక్కెరను తినొచ్చు. అయితే చక్కెరను వెంటనే నమిలి మింగేయకూడదు. కొంత సేపు నోట్లో అలాగే ఉంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.