ఎన్టీఆర్ విజయాల వెనక బసవతారకమ్మ త్యాగాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం లో ఆయన అర్ధాంగి బసవతారకం పాత్ర చాలా కీలకం. నిజానికి తెరముందు ఎన్టీఆర్ విజయాలను చూస్తున్నారు గాని , తెర వెనుక ఆయన భార్య పడిన కష్టం , అన్నీ తానై నడిపించిన తీరు ఏదో బహు కొద్దీ మందికి తప్ప చాలామందికి తెలీదు. అందుకే తల్లి గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు రెడీ అయ్యారు.
ఎన్టీఆర్ బయోపిక్ అందుకు వేదిక కానుంది. బసవతారకం పాత్ర కోసం విద్యా బాలన్ ని తీసుకోవడం వెనుక స్టార్ వేల్యూ మాత్రమే కాదు, దానివెనుక బలమైన పాత్ర స్వభావం ఉందని ఎన్టీఆర్ కుటుంబ సన్నిహితులు అంటున్నారు. ఎన్టీఆర్ పెళ్లి నాటి జ్ఞాపకాలను కొందరు మననం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అంతటి స్థాయికి చేరడం వెనుక బసవతారకం పాత్ర ఎంతోఉందని చెప్పుకొస్తున్నారు.
సాధారణ కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ పెళ్లయ్యేనాటికి మామూలు సబ్ రిజిస్ట్రార్ గా చేస్తున్నాడట. అయితే ఆ ఉద్యోగంతో వచ్చే దాంతో సంతృప్తి లేకపోవడంతో సినిమాల్లో ఛాన్స్ లకోసం ట్రై చేస్తానని బసవతారకం తో ఎన్టీఆర్ అన్నాడట. దానికి ఏమాత్రం ఆమె అడ్డుచెప్పకుండా, పూర్తిగా మద్దతు ఇస్తూ, తన వడ్డాణాన్ని అమ్మి మరీ ఆడబ్బుని ఇచ్చి చెన్నై కి పంపించిందట.
ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ గా ఉంటుంటే, 12మంది సంతానాన్ని ఎంతో ఓర్పు నేర్పుతో పెంచి పెద్దచేసిన ఘనత బసవతారకమ్మది. సినిమాలు , రాజకీయాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉంటే, కుటుంబ బాధ్యతను తన భుజాన మోసింది ఆవిడ. అందుకే ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో పైకి కన్పించని అంశాలు బసవతారకం పాత్రలో ఉన్నాయట.
బసవతారకం లోని గొప్పతనాన్ని ఆవిష్కరించాలంటే చాలా అనుభవం గల నటి కావాలని యూనిట్ నిర్ణయించింది. ఈనేపధ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి విద్యాబాలన్ పేరుని డైరెక్టర్ క్రిష్ ప్రతిపాదించాడు. ఇక ఈ పాత్రకోసం విద్యాబాలన్ ని ఒప్పించడానికి బాలయ్య ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి వివరించి, ఒప్పించాడట.
కేరక్టర్ గురించి విన్నవెంటనే విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బసవతారకం కి ఇష్టమైన హార్మోనియం కూడా విద్యా బాలన్ నేర్చుకుంటోందట. ఇక ఆ పాత్రలో ఎలా ఒదిగిపోతుందో వేచి చూడాలి.